ఇల్లు, కారు లేదంటే ఇతర అవసరాల కోసం లోన్ తీసుకున్న వారికి, భవిష్యత్తులో తీసుకోబోయే వారికి రిజర్వ్ బ్యాంక్ ఒక శుభవార్త తీసుకొచ్చింది. దేశంలోని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తమ ఇష్టానుసారం లోన్ నిబంధనలు, ముఖ్యంగా వడ్డీ రేట్లకు ఆధారమైన 'బెంచ్ మార్క్'లను మార్చకుండా కళ్లెం వేస్తూ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. లోన్ వడ్డీ రేట్లలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ఆర్బీఐ ఈ అడుగు వేసింది. ఈ కొత్త రూల్స్ సామాన్య రుణగ్రహీతలపై ఎంత వరకూ, ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం రండి...
ఇప్పటి వరకు కొన్ని సందర్భాల్లో బ్యాంకులు లోన్ తీసుకున్న వ్యక్తికి సమాచారం ఇవ్వకుండానే బెంచ్ మార్క్ విధానాలను మార్చేస్తుంటాయి. కానీ కొత్త ఆర్బీఐ రూల్స్ ప్రకారం.. ఇకపై ఏ బ్యాంకు కూడా లోన్ తీసుకున్న వ్యక్తి అనుమతి లేకుండా బెంచ్ మార్క్‌ను మార్చడానికి వీల్లేదు. ఒకవేళ బ్యాంకులు మార్చాల్సి వస్తే.. ఆ మార్పు వల్ల కస్టమర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకూడదు. ముఖ్యంగా ఈ మార్పు ప్రక్రియ కోసం బ్యాంకులు కస్టమర్ల నుంచి ఎలాంటి అదనపు ఫీజులు వసూలు చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ఈఎంఐ భారం పెరగకుండా జాగ్రత్తలు:
ఫ్లోటింగ్ రేట్ లోన్స్ తీసుకున్న వారికి ఈ రూల్స్ వల్ల భారీ ఊరట లభిస్తుంది. ఒక బెంచ్ మార్క్ నుంచి మరొక దానికి లోన్ మారినప్పుడు.. పాత వడ్డీ రేటు కంటే కొత్త వడ్డీ రేటు ఎక్కువగా ఉండకూడదని ఆర్బీఐ తేల్చి చెప్పింది. అంటే కేవలం బ్యాంక్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వల్ల కస్టమర్లు చెల్లించాల్సిన నెలవారీ EMI లేదా వడ్డీ భారం అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఇకపై ఉండదు.
పాత బెంచ్ మార్క్ రద్దైతే?
ఒకవేళ లోన్ అగ్రిమెంట్‌లో ఉన్న పాత బెంచ్ మార్క్ రద్దైతే, కస్టమర్‌కు ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా వేరొక బెంచ్ మార్క్‌కు సురక్షితంగా మార్చాలి. ప్రత్యామ్నాయ బెంచ్‌మార్క్ గురించి అగ్రిమెంట్‌లో ముందే స్పష్టం చేయాలి. అదేవిధంగా మీ లోన్ వేరొక సంస్థకు బదిలీ అయినప్పుడు.. అధికారికంగా బ్యాంక్ పేరు మారనంత వరకు పాత వడ్డీ రేట్లు, నిబంధనలే వర్తిస్తాయి. లోన్ తీసుకున్న కస్టమర్ కొత్త అగ్రిమెంట్‌పై సంతకం చేస్తేనే కొత్త సంస్థ రూల్స్ వర్తిస్తాయి.
ఈ కొత్త రూల్స్ ఏప్రిల్ 1, 2027 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పాత లోన్లన్నింటినీ ఏప్రిల్ 1, 2029 నాటికి ఒకేసారి ఈ కొత్త విధానంలోకి తీసుకురావాలని రిజర్వు బ్యాంక్ ప్రతిపాదించింది. ఇకపై వడ్డీ రేట్లు ఎన్ని నెలలకోసారిమారుస్తారు.. కచ్చితమైన తేదీ ఏంటి అనే విషయాలను బ్యాంకులు కస్టమర్లకు స్పష్టంగా చెప్పాల్సిందే. ఈ విధానం తమకు తెలియకుండా వడ్డీ రేట్లు పెరిగిపోతాయనే భయాన్ని కస్టమర్లకు దూరం చేస్తుంది. కస్టమర్ల ఫైనాన్షియల్ ప్లాన్స్ బ్యాంక్ నిర్ణయాలతో తలకిందులు కాకుండా కాపాడటమే కాకుండా ఒక బలమైన భద్రతా కవచంలా ఈ నిబంధనలు పనిచేస్తాయి.
