- చరిత్రలోనే అత్యంత శక్తిమంతంగా ఏర్పడే చాన్స్
- ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు
- కొన్ని ప్రాంతాల్లో కరువు.. మరికొన్నిచోట్ల వరదల ముప్పు
- వాతావరణ నిపుణులు, క్లైమేట్ అనలిస్టుల అంచనా
న్యూఢిల్లీ: పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో వచ్చే డిసెంబర్ నాటికి పీక్ స్టేజ్‌కు చేరుకోవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. ప్రస్తుత మనుషుల జీవితకాలంలోనే ఎన్నడూ చూడనంతటి బలమైన ఎల్ నినోగా ఇది రూపాంతరం చెందుతుందని పేర్కొంటున్నారు. ఇది ప్రపంచ ఉష్ణోగ్రతలను అనూహ్య స్థాయికి పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్‌ను, వాతావరణ మార్పులను తీవ్రతరం చేస్తుందని అంటున్నారు. భూమధ్యరేఖ పసిఫిక్ ప్రాంతంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే ‘సూపర్ ఎల్ నినో’ స్థాయికి చేరుకున్నాయని సముద్ర ఉష్ణోగ్రతలను ట్రాక్ చేస్తున్న వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే, సముద్ర ఉపరితలం కింద నిక్షిప్తమై ఉన్న వేడి జలాలు రాబోయే కొన్ని నెలల్లో ఉపరితలానికి చేరుకోనుండటం పరిశోధకులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రస్తుత అంచనాల ప్రకారం ఉష్ణమండల పసిఫిక్‌లోని ఉపరితల ఉష్ణోగ్రతల వేడి పరిమాణం ఆధునిక వాతావరణ రికార్డులలో అత్యంత శక్తిమంతమైన 3 సంఘటనలైన 1982–-83, 1997-–98, 2015-–16 నాటి శక్తివంతమైన ఎల్ నినో ఈవెంట్లలో నమోదైన స్థాయిలను ఇప్పటికే మించిపోయింది. వేడి పెరుగుదల వేగం, అంచనా వేసిన గరిష్ట తీవ్రత, నిల్వ అయి ఉన్న మహాసముద్రపు వేడి పరిమాణంతో సహా ఈ ఈవెంట్ రికార్డులను బద్దలు కొడుతోందని క్లైమేట్ అనలిస్ట్ కొలిన్ మెక్‌కార్తీ చెప్పారు. సాధారణంగా మధ్య తూర్పు పసిఫిక్ మహాసముద్రం అంతటా వెచ్చని నీరు అత్యధికంగా వ్యాపించినప్పుడు ‘ఎల్ నినో’ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ ప్రక్రియలను భగ్నం చేస్తుంది. దీంతో వివిధ ఖండాలలో వర్షపాతం, కరువు, వరదలు, ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు, ఉష్ణమండల తుఫానుల వంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.
2 డిగ్రీలు పెరగనున్న గ్లోబల్ టెంపరేచర్‌లు
మానవ కార్యకలాపాలతో ఏర్పడిన వాతావరణ మార్పులతో పాటు ఈ శక్తిమంతమైన ఎల్ నినో ప్రభావం వల్ల 2027లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. పారిశ్రామిక విప్లవం నాటి కంటే ముందు స్థాయిలతో పోలిస్తే ఇప్పుడు ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు సుమారు 2 డిగ్రీ సెల్సియస్‌ల వరకు ఎక్కువగా నమోదు కావచ్చట. ఇదే జరిగితే కొన్నివేల సంవత్సరాలుగా ఎన్నడూ చూడనంతటి తీవ్ర స్థాయిలో వాతావరణం మారిపోతుందని సైంటిస్టుల అంచనా. దీని ప్రభావంతో రాబోయే 12 నుంచి 18 నెలల్లో ప్రపంచమంతా విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడవచ్చని హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రత మార్పులు, రుతుపవనాల నమూనాలలో మార్పులు, కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన కరవులు, మరికొన్ని ప్రాంతాలలో భారీగా వరదల ముప్పు ఏర్పడే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు.
