హైదరాబాద్, వెలుగు: వచ్చే వారం నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతోందని ఆ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. నియామక ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నట్టు చెప్పారు. శనివారం నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన సిబ్బందిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.
రాష్ట్రంలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియను దేశానికే మోడల్‌గా మార్చాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. నియామకాల్లో కచ్చితత్వం, భద్రతను పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని తెలిపారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి.. ఎగ్జామ్స్ నిర్వహణ, రిజల్ట్స్ ప్రాసెసింగ్‌లో అత్యాధునిక డిజిటల్ వ్యవస్థలను అనుసంధానం చేస్తామని ఆయన తెలిపారు. అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కమిషన్‌ను బలోపేతం చేస్తామన్నారు.
చిన్న పొరపాటైనా ఊపేక్షించం..
ఉద్యోగాల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఏళ్ల తరబడి శ్రమిస్తుంటారని, నియామక ప్రక్రియలో సిబ్బంది చేసే చిన్న పొరపాటైనా వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. రిక్రూట్‌మెంట్ లోని ప్రతి దశలోనూ ఉద్యోగులు అత్యంత అప్రమత్తంగా, అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు. రెండు జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌లను విజయవంతంగా నిర్వహించడం ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా టీజీపీఎస్సీ వైపు చూస్తున్నాయని, ఈ గౌరవాన్ని కాపాడుకోవాలని కోరారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని, భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కొనేలా డిజిటల్ నాలెడ్జ్ సంపాదించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు డాక్టర్ అమీర్ ఉల్లా ఖాన్, పి.రజనీ కుమారి, సి.చంద్రకాంత్ రెడ్డి, ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, కార్యదర్శి ఎం.హరిత ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
