- బొంగుళూరులో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఇబ్రహీంపట్నం, వెలుగు: ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు తావులేకుండా, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరులో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆయన ప్రారంభించి, లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పటిష్టం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కొత్త కార్డులలో క్యూఆర్ కోడ్, ఆధార్ వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం డిజిటల్ విధానంలో పొందుపరిచామని చెప్పారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 6.72 లక్షల కార్డుల ద్వారా లబ్ధి చేకూరుతుండగా, కొత్తగా మరో 1.12 లక్షల కార్డులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, ప్రకాశ్‌గౌడ్, అరికేపూడి గాంధీ, అడిషనల్కలెక్టర్ చంద్రా రెడ్డి, పౌర సరఫరాల అధికారులు వనజాత, హరీశ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
