నాగపంచమి వేళ పాములను హింసిస్తే జైలు శిక్ష..

నాగపంచమి వేళ  పాములను  హింసిస్తే జైలు శిక్ష..

నాగపంచమి పండుగ వేళ సర్పాలను పూజించే సంప్రదాయం పేరుతో వాటిని హింసించొద్దని తెలంగాణ అటవీశాఖ, ఫ్రెండ్స్‌‌ ఆఫ్‌‌ స్నేక్‌‌ సొసైటీ, గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ (జీహెచ్‌‌ఎస్‌‌పీసీఏ) ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. పాములను బంధించి కోరలు పీకడం, నోరు కుట్టేయడం, ఆకలి దప్పులతో మగ్గించడం, బలవంతంగా పాలు తాగించడం వంటి చర్యలతో వాటి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోందని హెచ్చరిస్తున్నాయి.  ఆగస్టు 17న నాగపంచమి నేపథ్యంలో పాముల హింసను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలతో నిఘా, దాడులు చేపడుతున్నట్లు అటవీశాఖ  అధికారులు చెప్పారు.

పుట్టల్లో పాములు ఉన్నాయనే భ్రమతో కొందరు భక్తులు కెమికల్స్ లేదా ఘాటైన పసుపు, కుంకుమలను పుట్టల లోపలికి చల్లుతుంటారు. దీనివల్ల పాముల చర్మం కాలిపోతుంది. భగవంతుడు జీవకారుణ్యాన్ని కోరుకుంటాడు కానీ జీవహింసను కాదు. జీవహింస లేని పవిత్రమైన పూజా విధానాలతో పూజలు చేయడం శ్రేయస్కరం అంటున్నారు పూజారులు. రాతి లేదా వెండి విగ్రహాలు, గుడిలోని నాగశిలలకు లేదా ఇంట్లో ఉండే వెండి, రాగి నాగ పడగలకు పాలాభిషేకం చేయండి. మట్టితో చేసిన నాగదేవత ప్రతిమలను పూజించి, వాటికి నైవేద్యాలు సమర్పించండి. శివుని మెడలో అలంకారంగా ఉండే నాగదేవతను స్మరిస్తూ శివలింగానికి పూజలు చేయడం అత్యంత ఫలప్రదం అంటున్నారు పూజారులు.

పాముల రెస్క్యూ

నాగపంచమి పండుగ వేళ పాములను హింసించొద్దని, పాములవాళ్లపై నిఘా ఉంచాలని గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ (జీహెచ్‌‌ఎస్‌‌పీసీఏ) ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నాగ పంచమి సమయంలో గాయపడిన లేదా పాములు పట్టేవారు బంధించిన పాములను రక్షించడం, వాటికి చికిత్స చేసి, తిరిగి విడుదల చేయడంలో 20 ఏళ్లుగా జీహెచ్‌‌ఎస్‌‌పీసీఏ పనిచేస్తోంది. ఈ జంతు సంక్షేమ సంస్థ ఇప్పటివరకు ఈ పండుగ సమయంలో 5,276 పాములను రక్షించింది.

పాములను హింసించడం నేరం


వన్యప్రాణి సంరక్షణ చట్టం1972 ప్రకారం పాములను హింసించడం నేరం, బెయిల్ ఇవ్వడానికి వీలులేని నేరం. ఎవరైనా అలా చేసినా లేదా అనుసరించినా శిక్షార్హులని ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ బాలయ్య చెప్పారు. ప్రతి సంవత్సరం నాగ పంచమి రోజున శాలిబండ, హుస్సేనీ ఆలం, గౌలిపుర, బేగం బజార్, దూద్‌‌బౌలి, లాల్ దర్వాజా, రామ్‌‌కోటి, మొగల్‌‌పుర, కామాటిపుర ప్రాంతాల్లో పాములను ఆడిస్తుండగా అటవీశాఖ అధికారులు, వాలంటీర్లు వారిని పట్టుకొని పాములను చికిత్స కోసం భౌరంపేటలోని పాముల పునరావాస కేంద్రానికి తరలిస్తామని బాలయ్య చెప్పారు. దీని కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు.

పాములను ఆడిస్తే ఫిర్యాదు చేయండి

పాములు పాలు తాగవనే శాస్త్రీయ నిజాన్ని మీ పిల్లలకు, చుట్టుపక్కల వారికి వివరించాలని, బుట్టల్లో బంధించి పాములను ఆడిస్తుంటే రెస్క్యూ టీమ్‌‌కు ఫిర్యాదు చేయాలని అటవీశాఖ ఫారెస్ట్ రేంజ్ అధికారి బాలయ్య, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ విశ్వనాథన్ కోరారు.  మీ పరిసరాల్లో పాములను హింసిస్తూ కనిపిస్తే వెంటనే ఫారెస్ట్ డిపార్ట్‌‌మెంట్ టోల్ ఫ్రీ నంబర్​ : 1800-–425-5364  లేదా తెలంగాణలోని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ఫోన్ నంబర్​ 83742-33366 వంటి హెల్ప్‌‌లైన్ నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.

కుట్లు వేయొద్దు!

పాములు పట్టేవారు నాగపంచమికి ఒకటి లేదా రెండు నెలల ముందు నాగుపాములను పట్టుకుని హింసిస్తుంటారని వాటి కోరలు, విష గ్రంథులను బలవంతంగా తొలగించి, నోళ్లకు కుట్లు వేస్తారని  ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ విశ్వనాథన్ చెప్పారు. వాటికి ఎలాంటి ఆహారం ఇవ్వకుండా మూసి ఉన్న చీకటి గదుల్లో ఉంచడం వల్ల చాలా పాములు చనిపోతుంటాయని ఆయన తెలిపారు. నాగపంచమి సమయంలో ప్రజల ముందుకు తీసుకొచ్చి పాలు తాగించడం వల్ల అజీర్ణం కారణంగా ఈ పాములు చనిపోతుంటాయని ఆయన చెప్పారు.  

నాగ పంచమి జాతర

బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో జరిగే నాగ పంచమి జాతర అత్యంత సాహసోపేతమైనది. ప్రతి సంవత్సరం నాగ పంచమి పండుగ రోజున ఇక్కడి భక్తులు వందలాది జీవమున్న విషపూరితమైన పాములను చేతుల్లో పట్టుకుని, మెడలో వేసుకుని పెద్ద ఎత్తున ఊరేగింపులు నిర్వహిస్తారు. ఈ ప్రసిద్ధ ఉత్సవం బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా సింఘియా ఘాట్ ప్రాంతంలో శతాబ్దాలుగా సాగుతోంది. పాములను మెడలో వేసుకొని, వాటిని చేతుల్లో పట్టుకుని భక్తులు డప్పు వాయిద్యాల మధ్య పరవశంతో నృత్యాలు చేస్తారు. పండుగ ముగిసిన తర్వాత మళ్లీ నదిలోకి, అడవుల్లో వదిలిపెడుతుంటారు.