ఒకప్పుడు ప్రతి ఇంట్లో కనిపించిన ఇత్తడి, రాగి, కంచు వంటపాత్రలు ఇప్పుడు ఆధునిక వంటిళ్లలోకి తిరిగి అడుగుపెడుతున్నాయి. జర్మన్ సిల్వర్, స్టీల్ పాత్రల వాడకంతో కనుమరుగైన సంప్రదాయ వంటసామాగ్రికి మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్ వంటి సిటీల్లో ఉండే కొన్ని హోటళ్ల ఇప్పుడు వీటినే వాడుతున్నారు. ఇవి ఇప్పుడు ఇళ్లలోనూ వంటగదుల్లోకి వచ్చేశాయి. సంప్రదాయ వంటపాత్రలు మన్నికగా ఉండటంతోపాటు వంటింటికి ప్రత్యేకమైన అందాన్ని, వారసత్వ శోభను తీసుకొస్తున్నాయి.
రాగి మంచి ఉష్ణ వాహకం కావడంతో వేడిని త్వరగా, సమానంగా ప్రసారం చేస్తుంది. అందువల్ల వంటలో టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. ఇత్తడికి సహజసిద్ధమైన సూక్ష్మక్రిమి నిరోధక లక్షణాలు ఉన్నాయని, పాత్రల ఉపరితలంపై బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో ఇది సాయపడుతుందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇత్తడి, రాగి పాత్రలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని, ఉబ్బసం తగ్గిస్తాయని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయని, బరువు తగ్గడానికి లేదా చర్మకాంతికి నేరుగా ఉపయోగపడతాయని చెప్పే వాదనలకు బలమైన వైద్య ఆధారాలు ప్రతిసారీ ఉండకపోవచ్చు. అందువల్ల ఆరోగ్య ప్రయోజనాల విషయంలో శాస్త్రీయ ఆధారాలను పరిగణనలోకి తీసుకోవడం అవసరం. ముఖ్యంగా ఆమ్ల పదార్థాలను నేరుగా రాగి లేదా ఇత్తడి పాత్రల్లో వండటం సరికాదు. పాత్రలకు టిన్ పూత ఉందా, వాటిని ఏ రకమైన వంటకు ఉపయోగించాలో తయారీదారు సూచనలు ఏమిటో తెలుసుకుని వాడడం మంచిది.
‘థతేరా’ కళాకారుల చేతుల్లో..
సంప్రదాయ లోహపాత్రల తయారీలో నైపుణ్యం కలిగిన ‘థతేరా’ హస్తకళాకారులు ఇత్తడి కడాయి, తవా, గరిటె, మసాలా పెట్టెలు తదితర వంటసామాగ్రిని తయారు చేస్తున్నారు. చేతితో తయారు చేసిన ఇలాంటి పాత్రలు సంప్రదాయ వంటకు అనువుగా ఉండటంతోపాటు వంటింటికి ప్రత్యేక ఆకర్షణను తీసుకొస్తున్నాయి. ఇత్తడి, కంచు, రాగి వంటసామాగ్రి ధరలు స్టీల్ పాత్రలతో పోలిస్తే ఎక్కువగా ఉండొచ్చు. అయినప్పటికీ మన్నిక, సంప్రదాయ విలువ, ఆకర్షణ కారణంగా కస్టమర్స్ వీటిని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఎక్కడ దొరుకుతాయి?
హైదరాబాద్‌లో ఇత్తడి, రాగి, కంచు వంటపాత్రల కోసం బేగంబజార్ – ఫీల్ఖానా – సిద్ధి అంబర్ బజార్ ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రాంతాల్లో అనేక మెటల్‌వేర్, కిచెన్‌వేర్ దుకాణాలు ఉన్నాయి. బేగంబజార్ ఫీల్ఖానాలోని ఎస్.ఎఫ్. అండ్ సన్స్, అస్టాక్, నసీబ్ మార్కెట్‌లోని ఎస్.ఎం. బ్రదర్స్, సిద్ధిఅంబర్ బజార్‌లోని స్టార్ హ్యాండీక్రాఫ్ట్, పత్తర్‌ఘట్టి, ఉస్మానియా బజార్‌లోని సయ్యద్ గౌస్ అండ్ కో., హరిబౌలిలోని బీఎం మెటల్ మార్ట్ వంటి దుకాణాల్లో కాపర్, బ్రాస్ తదితర కిచెన్‌వేర్ లభిస్తున్నాయి. సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోనూ సంప్రదాయ లోహ వంటపాత్రలు దొరుకుతున్నాయి. బంజారాహిల్స్‌లోని జిష్టా, కొండాపూర్‌లోని కిచెన్ హబ్ వంటి ప్రత్యేక దుకాణాల్లో సంప్రదాయ ఇత్తడి, కంచు వంటసామాగ్రిని కొనుగోలు చేయొచ్చు. కొండాపూర్‌లోని శరత్ సిటీ మాల్‌లోనూ లైనింగ్ కలిగిన ఇత్తడి పాత్రలు లభిస్తున్నాయి. కూకట్‌పల్లి, ప్రగతినగర్ ప్రాంతాల్లో కంచు పాత్రల హోల్‌సేల్ వ్యాపారులు ఉన్నారు.
రకరకాల వంటపాత్రలు.
కాపర్ వాటర్ డిస్పెన్సర్లు, ఇత్తడి లగాన్, హ్యామర్డ్ కాపర్ లగాన్, ఇన్సులేటెడ్ హ్యాండిల్‌తో ఇత్తడి రోటీ తవా, దోశ తవా, పాలు కాచే పాత్రలు, ఇత్తడి కడాయిల సెట్‌లు, గరిటెల సెట్‌లు, ఇత్తడి మసాలా డబ్బాలు, రాగి ఫ్రైయింగ్ పాన్లు, టిన్ పూత కలిగిన ఇత్తడి నెయ్యి పాత్రలు, రోటీ డబ్బాలు వంటి వాటికి డిమాండ్ ఉంది. చదునైన అడుగు భాగం, గాజు మూతతో లభించే కొన్ని ఇత్తడి కడాయిలను నాన్‌స్టిక్, టెఫ్లాన్ రహిత ప్రత్యామ్నాయాలుగా మార్కెట్ చేస్తున్నారు. అయితే కొనేటప్పుడు పాత్రపై పూత, తయారీ విధానం వంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి.
నిన్నటి వంటింటి జ్ఞాపకాలు..
ఇవి పాతతరానివి కాదు.. సంప్రదాయాన్ని ఆధునికతతో కలిపే కొత్త ట్రెండ్. అందుకే.. ‘పాత’ పాత్రలకు ఇప్పుడు మళ్లీ ‘కొత్త’ రోజులు వచ్చాయి!
పాతవి కావు.. కొత్త ట్రెండ్!
ఒకప్పుడు పాతకాలపు వస్తువులుగా భావించిన ఇత్తడి, రాగి, కంచు వంటపాత్రలు ఇప్పుడు ఆధునిక వంటింటి ట్రెండ్‌గా మారుతున్నాయి. సంప్రదాయానికి దగ్గరగా ఉండాలనే ఆసక్తి, మన్నికైన వస్తువులపై పెరుగుతున్న ఆదరణ, వంటింటికి ప్రత్యేకమైన లుక్ రావాలనే అభిరుచి వీటి డిమాండ్‌కు కారణమవుతున్నాయి. ఆన్‌లైన్‌లో కొనేటప్పుడు మాత్రం నాణ్యమైన, ఆహార వినియోగానికి అనువైన ఉత్పత్తులనే ఎంచుకోవాలి. తయారీదారు వివరాలు, లోహ స్వచ్ఛత, పూత వివరాలు, ఉపయోగించే విధానం, నిర్వహణ సూచనలను పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయడం మంచిది.
