- నుజ్జునుజ్జయిన మహిళ కాలు తొలగించిన డాక్టర్లు
- కొడుకుకు తీవ్రగాయాలు
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ టోల్గేట్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. కాళ్లు, చేతులు నుజ్జునుజ్జు కాగా, వారిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పినకాసి సతీశ్, భార్య స్వప్న, కొడుకు విక్కీతో కలిసి బైక్‌పై శనివారం అంతర్గాం మండలం గోయిల్‌వాడ సమీపంలో గోదావరి నదికి స్నానానికి వెళ్లి, తిరుగు ప్రయాణమయ్యారు.
బసంత్‌నగర్ టోల్గేట్ దాటిన తర్వాత రాజీవ్ రహదారిపై పక్క నుంచి వెళ్తున్న లారీ బాడీ బైక్ హ్యాండిల్‌కు తగలడంతో సతీశ్ కుడివైపు డివైడర్ మధ్యలో పడగా, భార్య స్వప్న, కొడుకు విక్కీ ఎడమవైపు లారీ టైర్ కింద పడ్డారు. ఈ ఘటనలో స్వప్న కుడి కాలు, విక్కీ కుడి చేయి, కాలు నుజ్జునుజ్జయ్యాయి.
స్థానికులు అంబులెన్స్ ద్వారా వారిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. స్వప్నకు ఆపరేషన్ చేసి కుడి కాలు తొలగించారు. శనివారం సాయంత్రం కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వెళ్లాల్సి ఉండగా, గోదావరి నదికి స్నానం చేయడానికి వచ్చారు. బసంత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
