కొన్ని పాత్రలు నటుడిని తెరపై మాత్రమే మార్చవు. ఆ పాత్ర కోసం చేసే ప్రయాణం నటుడినే లోపల నుంచి మార్చేస్తుంది. శ్రియం భగ్నానీకి ‘సుమో దీదీ’ అలాంటి పాత్రే. భారతదేశపు తొలి ప్రొఫెషనల్ మహిళా సుమో రెజ్లర్ హేతల్ డేవ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన ఈ చిత్రంలో శ్రియం ప్రధాన పాత్ర పోషించింది. 2023లో టోక్యో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ఈ సినిమా, పామ్ స్ప్రింగ్స్ వంటి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ చోటు దక్కించుకుంది. ఇప్పుడు ఓటీటీ ద్వారా ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ‘సుమో దీదీ’లో హేతల్‌గా కనిపించడానికి శ్రియం చేసిన ప్రయాణం అంత సులభమైనది కాదు. తెరపై ఒక సుమో రెజ్లర్‌లా కనిపించడం కోసం కేవలం బరువు పెంచుకోవడంతో సరిపోలేదు. దాదాపు ఏడాది పాటు సాగిన శిక్షణ ఆమె కెరీర్‌లోనే అత్యంత కఠినమైన అనుభవాల్లో ఒకటిగా మారింది.
చిన్నప్పటి నుంచి ఆమెకు టెన్నిస్ అంటే ఎంతో ఇష్టం. రాష్ట్రస్థాయిలో టెన్నిస్ కూడా ఆడింది. కానీ కాలేజీలో అనుకోకుండా ఒక నాటకంలో నటించే అవకాశం రావడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పటివరకు నటన గురించి పెద్దగా ఆలోచించని శ్రియం, వేదికపై ఒక పాత్రలో జీవించడం ద్వారా ఆ అనుభూతికి ఆకర్షితురాలైంది.
“ఒక పాత్రగా ఉంటూనే నేనుగా ఉండగలగడం నచ్చింది” అనే భావనతో నటన వైపు అడుగులు వేసింది. అక్కడి నుంచి నటనను సీరియస్‌గా తీసుకుంది. ముంబైలోని బ్యారీ జాన్ యాక్టింగ్ స్టూడియోలో శిక్షణ తీసుకుని ఫిల్మ్ యాక్టింగ్‌లో డిప్లొమా చేసింది. నటనతోపాటు సినిమా ఎలా తయారవుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో నిర్మాణం, ఎడిటింగ్, డైరెక్టర్‌కి అసిస్టెంట్‌గా కూడా పనిచేసింది. కెమెరా ముందు, వెనుక జరిగే ప్రాసెస్‌ను అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసింది.
కోల్‌కతా నుంచి ముంబైకి..
శ్రియం (Shriyam Bhagnani) తన బాల్యాన్ని కోల్‌కతాతో అనుబంధంగా చెప్పుకుంది. ఒక ఇంటర్వ్యూలో ‘‘కోల్‌కతా నుంచి ముంబైకి మారాక, చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఫీల్ అయ్యాను. కొంతకాలం గడిచిన తర్వాత ముంబై తనకు ఇష్టమైన ప్రదేశంగా మారింద’’ని చెప్పింది. శ్రియం భగ్నానీ పేరు వినగానే భగ్నానీ కుటుంబం గుర్తుకు రావడం సహజం. ఆమె ప్రముఖ నిర్మాత వాషు భగ్నానీకి మేనకోడలు, నటుడు-నిర్మాత జాకీ భగ్నానీకి కజిన్. బాలీవుడ్‌తో బలమైన అనుబంధం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, తన అవకాశాల కోసం కుటుంబం పేరు ఉపయోగించుకోవడం తనకు ఇష్టం లేదని శ్రియం చాలామార్లు చెప్పింది. అంతేకాదు, కుటుంబ నిర్మాణ సంస్థకు సంబంధించిన సినిమాలకే ఆడిషన్ ఇచ్చి ఎంపిక కాలేకపోయిన సందర్భాలూ ఉన్నాయని తెలిపింది.
►ALSO READ | పాన్ మసాలా యాడ్ వివాదం..బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు
ఆ ప్రయాణంలో ఆడిషన్లు ఆమె జీవితంలో సాధారణ భాగమయ్యాయి. ఒక ఇంటర్వ్యూలో నటులు వంద ప్రాజెక్టులకు ఆడిషన్ ఇస్తే ఒకటి దక్కడం కూడా సాధారణమేనని, తిరస్కరణలను తట్టుకోవడం తనలో మనోధైర్యాన్ని రెట్టింపు చేశాయి. తన పని విషయంలో నిజాయితీని మాత్రం ఎప్పటికీ వదులుకోనని కూడా స్పష్టం చేసింది.
‘బాఘీ-2’తో తెరపైకి..
శ్రియం యాక్టింగ్ జర్నీ 2018లో ‘బాఘీ 2’తో ప్రారంభమైంది. ఈ పాత్రకు పలు దశల్లో ఆడిషన్లు ఇచ్చిన తర్వాతే ఆమె ఎంపికైంది. ఆ తర్వాత 2025లో ‘ఆప్ జైసా కోయి’లో ఆర్. మాధవన్‌తో కలిసి పనిచేసింది. మాధవన్ తన అభిమాన నటుల్లో ఒకరని చెప్పిన శ్రియం, ఆయనతో తొలి సీన్ టైంలో చాలా టెన్షన్ పడిందని, మొదటి సీన్లో ఆయన పేరును కూడా తప్పుగా పలికినట్లు గుర్తుచేసుకుంది.
హేతల్‌గా మారడం..
‘సుమో దీదీ’ ఆమె కెరీర్‌లోనే డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిన పాత్ర. భారతదేశపు తొలి ప్రొఫెషనల్ మహిళా సుమో రెజ్లర్ హేతల్ డేవ్ పాత్ర కోసం శ్రియం తన శరీరాన్ని పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. ఆ పాత్ర కోసం శిక్షణ ప్రారంభమైనప్పుడు ఆమె బరువు సుమారు 83 కిలోలు. పాత్ర కోసం దాన్ని దాదాపు 97 కిలోలకు తీసుకెళ్లారు. ఆమె ట్రైనర్ సహిల్ రషీద్ ఆధ్వర్యంలో క్రీడకు అవసరమైన శక్తి, వేగం, బ్యాలెన్స్, కదలికలపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. సుమో పోరాటం చూడటానికి నెమ్మదిగా అనిపించినా, ఒక రౌండ్ కొన్ని సెకన్లలోనే ముగిసిపోవచ్చు. అందుకే శ్రియం శరీరానికి బలం మాత్రమే కాకుండా, వేగంగా స్పందించే సామర్థ్యం కూడా అవసరమైంది. సుమో రెజ్లర్లకు ఉండాల్సిన వశ్యత, కాళ్ల బలం, కిందకు వంగే కదలికలు, ప్రత్యర్థిని ఎదుర్కొనే భంగిమలను కూడా సాధన చేసింది.
హేతల్ దగ్గరే అసలు సుమో పాఠాలు
హేతల్ స్వయంగా ఆమెకు సుమో స్క్వాట్, ప్రత్యర్థిని ఎదుర్కొనే తీరు, రింగ్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఉండాల్సిన చూపు, తనకంటే పెద్ద ప్రత్యర్థిని చూసినప్పుడు ఎలా సిద్ధపడాలో నేర్పింది. పాత్రను కేవలం శరీరంతో కాకుండా, ఒక రెజ్లర్ మనస్తత్వంతో అర్థం చేసుకోవడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడింది. బరువుతో ఉన్నప్పటికీ కఠినమైన కదలికలను చేయగలగడం తనకు ఎంతో శక్తివంతమైన అనుభూతిని ఇచ్చిందని శ్రియం చెప్పింది.
ఖాళీ గ్యాస్ సిలిండర్లతోనూ శిక్షణ!
సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో హేతల్ అందుబాటులో ఉన్న సాధారణ వస్తువులతోనే వ్యాయామం చేస్తుంది. దాన్ని సహజంగా చూపించడానికి శ్రియంకు ఖాళీ గ్యాస్ సిలిండర్లను ఉపయోగించి పట్టు బలం పెంచే వ్యాయామాలు చేయించారు. కిందికి వంగి నేలను ఊడ్చే కదలికలతో కాళ్ల కదలిక, శరీర పరిధిని మెరుగుపరిచారు. శిక్షణ సమయంలో పోషకాహార నిపుణుల పర్యవేక్షణలో రోజుకు సుమారు 2,500 కేలరీల ఆహారం తీసుకునేది. రెజ్లర్ లుక్ కోసం అంతలా కష్టపడింది.
25 కిలోలు తగ్గి..
ఒక సినిమాలో నటించేందుకు ఆమె ఒకసారి 25 కిలోల వరకు బరువు తగ్గింది. కానీ ఆ సినిమా చివరకు ఆగిపోయింది. మరో ప్రాజెక్ట్ కోసం బరువు పెంచాల్సి వచ్చింది. అదీ నిలిచిపోయింది. ఈ అనుభవాలు తన శారీరక, మానసిక స్థితిపై ప్రభావం చూపాయని ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. అందుకే ‘సుమో దీదీ’ కోసం చేసిన మార్పు కేవలం తెరపై కనిపించే రూపం కోసం చేసిన మేకోవర్ కాదు.
ఇంతకుముందు ఎదురైన అనుభవాల తర్వాత మరోసారి తన శరీరాన్ని ఒక పాత్ర కోసం మార్చుకోవడం పెద్ద సవాలే. అయినా ఈసారి పాత్ర తనకు ఎంతో ప్రత్యేకమైనదని భావించి శిక్షణను కొనసాగించింది. ఈ పాత్ర కోసం దాదాపు తొమ్మిది నెలలు శిక్షణ తీసుకుంది. సినిమా టీం మొదట కొంతమంది నటీమణులను శిక్షణలో పెట్టి, ఆ తర్వాత తుది ఎంపిక చేసినట్టు కూడా ఆమె వివరించింది.
‘సుమో దీదీ’ తర్వాత..
‘‘ఒక పాత్రలో కనిపించి, వెంటనే మరో పాత్రలో పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా మారగలగడం తనకు ఇష్టం. నటనలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని, తాను తన ప్రయాణంలో ఇప్పుడు బిగినింగ్ స్టేజీలో ఉన్నానని ఆమె భావిస్తుంది. నటనకు మించి ప్రపంచాన్ని చుట్టి చూడాలన్న కోరిక కూడా ఉంది. విభిన్న అనుభవాలను పొందుతూ, వీలైనన్ని జీవితాలను పాత్రల ద్వారా జీవించాలన్నది నా కల”అంటోంది శ్రియం.
