బషీర్‌బాగ్, వెలుగు: భూములు, సొంత స్థలాలపై బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని నమ్మించి, సేల్‌డీడ్ పత్రాలను దుర్వినియోగం చేస్తూ కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరస్తుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్ట్‌చేశారు. నిందితుడు రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌కు చెందిన నునావత్ యుగంధర్ పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 2016 నుంచి ఇప్పటివరకు 20కి పైగా క్రిమినల్, సివిల్ కేసులు నమోదయ్యాయి. సుమారు 30 మంది బాధితులను మోసగించి రూ.10 కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు దర్యాప్తులో తేలింది.
ఓ బాధితుడికి రూ.60 లక్షలు ఇచ్చి సేల్‌డీడ్ రాయించుకున్న నిందితుడు, ఆ పత్రాలను దుర్వినియోగం చేసి మూడో వ్యక్తి పేరిట ఆస్తిని బదలాయించాడు. అంతేకాకుండా, ఆ ఆస్తిని యాక్సిస్ బ్యాంకులో తనఖా పెట్టి రూ.1.50 కోట్ల రుణం పొంది మోసానికి పాల్పడ్డాడు. బ్యాంకు నోటీసులతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, సీసీఎస్ పోలీసులు పక్కా సమాచారంతో నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈఓడబ్ల్యూ టీమ్ ఆధ్వర్యంలో నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
