మినీ ఇండియాగా హైదరాబాద్ ఫుడ్ కల్చర్.. ఆరటి ఆకులో ఆత్మీయత.. వైవిధ్యమైన రుచులతో నగర వంటకాలు!

మినీ ఇండియాగా హైదరాబాద్ ఫుడ్ కల్చర్.. ఆరటి ఆకులో ఆత్మీయత.. వైవిధ్యమైన రుచులతో నగర వంటకాలు!

హైదరాబాద్‌ అంటే బిర్యానీ.. హలీమ్‌.. కబాబ్‌లు మాత్రమే కాదు. దేశంలోని నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ప్రజలతో నగరం ‘మినీ ఇండియా’గా మారినట్టే.. వారి ఆహారపు అలవాట్లు, సంప్రదాయ రుచులు కూడా నగర వంటకాల వైవిధ్యాన్ని మరింత పెంచాయి. ఒక్కో పళ్లెంలో ఒక్కో ప్రాంతపు కథను, ఒక్కో వంటకంలో భారతీయ సంప్రదాయాల పరిమళాన్ని పరిచయం చేస్తూ.. హైదరాబాద్‌ ఫుడ్‌ కల్చర్‌ సరికొత్త రూపాన్ని సంతరించుకుంటోంది.


ఆంధ్ర ఘాటు నుంచి కేరళ సాద్య వరకు.. ఉత్తర భారత థాలీ నుంచి దక్షిణ భారత అల్పాహారం వరకు.. సంప్రదాయ భోజనం నుంచి ఆధునిక ఫైన్‌‌ డైనింగ్‌‌ వరకు ఇప్పుడు హైదరాబాద్‌‌లో రుచుల ప్రపంచమే అందుబాటులో ఉంది. ముఖ్యంగా శాకాహార వంటకాలకు పెరుగుతున్న ఆదరణతో సిటీలో వెజ్‌‌ రెస్టారెంట్లు కొత్త రుచుల వేదికలుగా మారుతున్నాయి. హైదరాబాద్‌‌లో ఉత్తర, దక్షిణ, బహుళ ప్రాంతీయ భారతీయ శాకాహార వంటకాలను అందించే ఫైన్‌‌-డైనింగ్‌‌ రెస్టారెంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జమున్‌‌, అస్థ్రా రీడిఫైన్డ్‌‌ డైనింగ్‌‌ వంటి రెస్టారెంట్లు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్ఫూర్తి పొందిన శాకాహార వంటకాలను అందిస్తున్నాయి. ఇక ఇష్టా రెస్టారెంట్‌‌ సంప్రదాయ దక్షిణ భారతీయ రుచులతో పాటు అన్‌‌లిమిటెడ్‌‌ థాలీకి పేరుగాంచింది. అన్న నేటివ్‌‌ క్లాసిక్‌‌ దక్షిణ భారతీయ, ప్రాంతీయ వంటకాలతో సంప్రదాయ రుచులను పరిచయం చేస్తోంది.

వివిధ రుచుల మెనూ..

మెనూలో పనీర్‌‌ టిక్కా, దాల్‌‌ మఖ్ని, వివిధ రకాల నాన్‌‌లు, కుల్చాలు వంటి ఉత్తర భారతీయ వంటకాలతో పాటు గుత్తి వంకాయ పులావ్‌‌, కోనసీమ పనీర్‌‌ వేపుడు, పచ్చి పులుసు వంటి తెలుగు రుచులు కూడా చోటు చేసుకుంటున్నాయి. సంప్రదాయ థాలీలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి సేకరించిన ప్రత్యేకమైన సూప్‌‌లు, స్టార్టర్లు, డెజర్ట్‌‌లు కూడా ఆహార ప్రియులకు అందుబాటులోకి వచ్చాయి.

రసవిహార్‌‌.. 

హైదరాబాద్‌‌లోని నానక్‌‌రామ్‌‌గూడ, ఫైనాన్షియల్‌‌ డిస్ట్రిక్ట్‌‌, మైస్కేప్‌‌ రోడ్‌‌, ది డిస్ట్రిక్ట్‌‌ ప్రాంతాల్లో ఉన్న రసవిహార్‌‌ పూర్తి శాకాహార ఫైన్‌‌-డైనింగ్‌‌ రెస్టారెంట్‌‌గా ప్రత్యేక గుర్తింపు పొందింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన ప్రామాణిక సాంప్రదాయ రుచులు, వారసత్వ వంటకాలతో ఇక్కడి మెనూ రూపొందించారు. ఉత్తర భారతీయ, దక్షిణ భారతీయ శాకాహార వంటకాలను ఆస్వాదించొచ్చు. 

కేరళ రుచులు..

కేరళ సంప్రదాయ రుచులను ఇష్టపడేవారికి ‘ఓణం సద్య’ ప్రత్యేక ఆకర్షణ. సంప్రదాయం, వేడుక, కేరళ అసలైన రుచుల సమ్మేళనంగా రూపొందించే ఈ విందును అరటి ఆకులో వడ్డించడం మరో ప్రత్యేకత అని కేరళకు చెందిన ఓ ఐటీ ఉద్యోగిని చెప్పారు. వర్షంపడుతున్న వేళ వేడి వేడి శాకాహార వంటకాలుఆస్వాదించాలనుకునే వారికి కూడా రసవిహార్‌‌ మంచి ఎంపిక. దోశలు, ఇడ్లీలు, పొంగల్‌‌, పోషకమైన ఉప్మా వంటి దక్షిణ భారతీయ అల్పాహార వంటకాలు ఆకట్టుకుంటాయి. ఆంధ్ర రుచులను కోరుకునేవారికి గుంటూరు చిల్లీ స్కేవర్స్‌‌ ప్రత్యేకమైన ఘాటు అనుభూతిని అందిస్తాయి.

ఒక్కో రెస్టారెంట్‌‌.. ఒక్కో ప్రత్యేక రుచి

హైదరాబాద్‌‌ సిటీలో యి జింగ్‌‌ రెస్టారెంట్‌‌లో డిమ్‌‌సమ్స్‌‌, నూడుల్స్‌‌, ఫ్రైడ్‌‌ రైస్‌‌ వంటి చైనీస్‌‌ రుచులు ఆకట్టుకుంటాయి. జువెల్‌‌ ఆఫ్‌‌ నిజాంలో ఇండియన్‌‌ వంటకాలతోపాటు రొయ్యల వంటకాలకు ప్రత్యేక ఆదరణ ఉంది. గోల్కొండ పెవిలియన్‌‌లో చైనీస్‌‌, అమెరికన్‌‌ రుచులతో పాటు వివిధ రకాల వంటకాలు లభిస్తాయి. వన్స్‌‌ అపాన్‌‌ ఎ టైమ్‌‌ రెస్టారెంట్‌‌లో ఇండియన్‌‌, ఏసియన్‌‌ వంటకాలతో పాటు హలీమ్‌‌, బిర్యానీ, పనీర్‌‌ డోనట్‌‌ మఖ్నీ వంటి వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

రూఫ్‌‌టాప్‌‌ డైనింగ్‌‌ను ఆస్వాదించాలనుకునేవారికి ఆల్టిట్యూడ్‌‌ లాంజ్‌‌ అండ్‌‌ బార్‌‌ మరో ఎంపిక. ఆది – ది లీలా హైదరాబాద్‌‌, మిస్ట్‌‌ ది పూల్‌‌సైడ్‌‌ కిచెన్‌‌లో చైనీస్‌‌ రుచులు, జువెల్‌‌ ఆఫ్‌‌ నిజాం– ది మినార్‌‌ వాతావరణం, ప్రత్యేక అనుభూతినిస్తున్నాయి. ఇటాలియన్‌‌ రుచులను ఇష్టపడేవారికి ఒట్టిమో కుసినా ఇటాలియానాలో పిజ్జా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అమరా రెస్టారెంట్‌‌లో సిబ్బంది, చెఫ్‌‌ల అంకితభావంతో పాటు సలాడ్‌‌ కౌంటర్‌‌ ప్రత్యేక ప్రశంసలు అందుకుంటోంది. వెట్రో రెస్టారెంట్‌‌లో ఇటాలియన్‌‌, ఇండియన్‌‌ వంటకాలతో పాటు ప్రత్యేక సందర్భాల్లో జంటల కోసం డేట్‌‌ అనుభవాలను కూడా అందిస్తున్నారు. డెక్కన్‌‌ పెవిలియన్‌‌లో బబుల్స్‌‌తో పాటు గోష్ట్‌‌ బిర్యానీ మస్ట్​ ట్రై ఐటెమ్​. 


భారతీయ భోజనం 

హైదరాబాద్‌లో సంప్రదాయ భోజనానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఆంధ్ర, దక్షిణ భారతీయ భోజనాలు, అరటి ఆకులో వడ్డించే వంటకాలు, వెజ్‌ థాలీలు, అన్​లిమిటెడ్ ఫుడ్​ వంటి సంప్రదాయ పద్ధతులు మళ్లీ ఆదరణ పొందుతున్నాయి. కార్పొరేట్‌ ఉద్యోగులు, ఆఫీస్‌ లంచ్‌ కోసం బయటకు వచ్చే వారిని దృష్టిలో పెట్టుకుని అనేక రెస్టారెంట్లు ప్రత్యేక లంచ్‌ మెనూలను అందిస్తున్నాయి. తక్కువ సమయంలో సంతృప్తికరమైన, ఇంటి భోజనాన్ని తలపించే ‘కంఫర్ట్‌ ఫుడ్‌’ అందించడంపై కూడా దృష్టి పెడుతున్నాయి. జూబ్లీ హిల్స్‌, బంజారాహిల్స్‌ వంటి ప్రాంతాల్లో శాకాహార రెస్టారెంట్ల సంఖ్య పెరుగుతుండటం సిటీలో మారుతున్న ఆహార అభిరుచులకు నిదర్శనం. 

మారుతున్న నగర రుచులు..

ఒకప్పుడు హైదరాబాద్‌ ఆహార సంస్కృతి అంటే ప్రధానంగా బిర్యానీ, కబాబ్‌లే గుర్తుకొచ్చేవి. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. సంప్రదాయ రుచులను కాపాడుతూనే కొత్త తరానికి నచ్చేలా వాటిని అందించేందుకు రెస్టారెంట్లు ప్రయత్నిస్తున్నాయి. ఒకే నగరంలో భారతీయ సంప్రదాయ వంటకాల నుంచి ఆధునిక ఫైన్‌-డైనింగ్‌ వరకు ఎన్నో రుచులను ఆస్వాదించే అవకాశం ఉంది. సంప్రదాయం, ప్రాంతీయత, ఆధునికత కలిసిన ఈ కొత్త ఆహార సంస్కృతి హైదరాబాద్‌ను దేశంలోని ప్రత్యేకమైన ఫుడ్‌ డెస్టినేషన్లలో ఒకటిగా నిలబెడుతోంది అంటున్నారు ఫుడ్ లవర్ అయిన టెకీ డి విష్ణు చైతన్య.