మెదడును రక్షించేందుకు శరీరంలో ఒక ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థ ఉంటుంది. దీనినే బ్లడ్–బ్రెయిన్ బ్యారియర్ (BBB) అంటారు. ఇది చాలావరకు క్రిములు మెదడులోకి చేరకుండా అడ్డుకుంటుంది. కానీ కొన్ని వైరస్‌లు, బ్యాక్టీరియాలు ఈ రక్షణ కవచాన్ని దాటగలవు. మరికొన్ని ఇన్ఫెక్షన్లు మెదడులో లేదా దాని చుట్టూ వాపు కలిగిస్తాయి. అందుకే జ్వరం ఎంత ఉంది అన్నదొక్కటే చూడకూడదు. జ్వరంతో పాటు ఏ లక్షణాలు వస్తున్నాయో కూడా గమనించాలి.
వరద నీటిలో దాగున్న ప్రమాదం
భారీ వర్షాల తర్వాత రోడ్లపై నీరు నిలవడం సాధారణమే. ఆ నీటిలో నడవడం మాత్రం అంత సురక్షితం కాదు. కలుషిత నీటి ద్వారా లెప్టోస్పిరోసిస్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రావచ్చు. ముఖ్యంగా ఎలుకలు, ఇతర అనారోగ్య జంతువుల మూత్రంతో కలుషితమైన నీరు దీనికి కారణమవుతుంది. లెప్టోస్పిరోసిస్‌లో మొదట జ్వరం, కండరాల నొప్పులు, కామెర్లు కనిపించవచ్చు. తీవ్రమైన పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్ మెదడుపై ప్రభావం చూపి మెనింజైటిస్ లేదా ఎన్సెఫలైటిస్కు దారితీయొచ్చు.
మెదడులో వాపు..
ఎన్సెఫలైటిస్ అంటే మెదడులో వాపు. ఇది ఎక్కువగా వైరస్‌ల వల్ల వస్తుంది. జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్, చాందిపురా వైరస్ వంటి వాటితోపాటు అరుదుగా హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ కూడా దీనికి కారణం కావచ్చు. మొదట జ్వరం, తలనొప్పి, వికారం, నీరసం కనిపించవచ్చు. కానీ పరిస్థితి వేగంగా మారొచ్చు. తికమక రావచ్చు. విపరీతమైన నిద్రమత్తు ఉండొచ్చు. ఫిట్స్ రావచ్చు. మాట తడబడొచ్చు. చివరకు స్పృహ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఎన్సెఫలైటిస్ను అత్యవసరంగా చికిత్స చేయాల్సిన పరిస్థితిగా డాక్టర్ సఫల్ శెట్టి చెప్తున్నారు.
ఈ లక్షణాలను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు
జ్వరంతో పాటు తీవ్రమైన తలనొప్పి, ప్రవర్తనలో మార్పు, లేపినా లేవనంత నిద్రమత్తు, ఫిట్స్, మెడ బిగుసుకుపోవడం, మాట్లాడటం లేదా నడవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం, చూపులో అకస్మాత్తుగా మార్పు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇవి సాధారణ వానాకాల జ్వరానికి సంబంధించిన లక్షణాలుగా తీసుకోకూడదు. మెదడు లేదా నాడీ వ్యవస్థపై ఇన్ఫెక్షన్ ప్రభావం చూపుతోందనడానికి ఇవి హెచ్చరికలు కావచ్చు!
వాన పడింది. వాతావరణం చల్లబడింది. కానీ వానతోపాటు కొన్ని కనిపించని ప్రమాదాలు కూడా మొదలవుతాయి. నీరు నిలిచే చోట దోమలు పెరుగుతాయి. కలుషిత నీటితో బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. వైరస్‌ల వ్యాప్తికీ వాతావరణం అనుకూలంగా మారుతుంది. ఫలితంగా జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు వంటి సమస్యలు రావడం సాధారణమే. అయితే ప్రతి జ్వరాన్ని ‘వైరల్ ఫీవర్’ అని తీసిపారేయడం సరికాదు. అరుదైన సందర్భాల్లో కొన్ని వానాకాల ఇన్ఫెక్షన్లు మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపొచ్చు. అప్పుడు మొదట సాధారణంగా కనిపించిన జ్వరం ఒక్కసారిగా తీవ్రమైన పరిస్థితిగా మారొచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. సమస్యను సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయం
‘‘ఒక వ్యక్తికి వానాకాలంలో జ్వరం వచ్చింది అనుకుందాం. మొదట జ్వరం, తలనొప్పి, నీరసం మాత్రమే ఉన్నాయి. అందుకే సాధారణ వైరల్ ఫీవర్ అనుకున్నారు. కానీ తర్వాత అతను అసాధారణంగా నిద్రపోవడం మొదలుపెట్టాడు. మాట స్పష్టంగా రాలేదు. తికమక మొదలైంది. ఇలాంటి మార్పులను ‘జ్వరం వల్లే’ అని వదిలేస్తే చికిత్స ఆలస్యమయ్యే అవకాశం ఉంది” అంటున్నారు డాక్టర్ సఫల్ ఎస్. శెట్టి. జ్వరం ఒక్కటే ప్రమాద సూచిక కాదు. జ్వరంతో పాటు మెదడు పనితీరులో మార్పులు కనిపిస్తున్నాయా? అన్నది చాలా ముఖ్యం. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సాయం తీసుకోవాలి.
డెంగ్యూ అంటే..
డెంగ్యూ అనగానే అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, ప్లేట్‌లెట్లు తగ్గడం.. ఇవే గుర్తుకొస్తాయి. కానీ చాలా అరుదుగా డెంగ్యూ మెదడుపైనా ప్రభావం చూపుతుంది. డెంగ్యూ ఉన్న సమయంలో వాంతులు, ఎక్కువ నిద్రమత్తు, తీవ్రమైన తలనొప్పి లేదా ఫిట్స్ వస్తే అప్రమత్తంగా ఉండాలి. స్పృహలో మార్పులు కనిపించినా, స్ట్రోక్‌ను పోలిన లక్షణాలు వచ్చినా వెంటనే వైద్య సాయం తీసుకోవాలి.
డాక్టర్ సూచనలు
బెంగళూరుకు చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, స్ట్రోక్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ సఫల్ ఎస్. శెట్టి ప్రకారం.. వానాకాలంలో వచ్చే చాలా ఇన్ఫెక్షన్లు తేలికగానే తగ్గిపోతాయి. కానీ ఇన్ఫెక్షన్ మెదడుకు చేరినప్పుడు పరిస్థితి వేగంగా తీవ్రమవుతుంది. అందుకే లక్షణాలను తొందరగా గుర్తించడం చాలా ముఖ్యం. సకాలంలో సరైన చికిత్స మొదలుపెడితే పూర్తిగా కోలుకునే అవకాశం మెరుగ్గా ఉంటుంది.
జాగ్రత్తే మొదటి రక్షణ
వానాకాలంలో దోమల కాటుకు దూరంగా ఉండాలి. చేతులు, కాళ్లు కప్పే దుస్తులు ధరించాలి. ఇంటి చుట్టూ నీరు నిలవకుండా చూసుకోవాలి. శుభ్రమైన నీటినే తాగాలి. వీలైనంతవరకు వరద నీటిలో నడవకూడదు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా జ్వరం వచ్చిందని సొంతంగా మందులు వేసుకుంటూ రోజులు గడపకూడదు. లక్షణాలు తగ్గుతున్నాయా? లేక కొత్త లక్షణాలు మొదలవుతున్నాయా? అన్నది గమనించాలి. మెదడుకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య సాయం తీసుకోవాలి. ఎందుకంటే వానాకాలంలో వచ్చే ప్రతి జ్వరం ప్రమాదకరం కాకపోయినా.. ప్రమాదకరమైన జ్వరాన్ని ముందుగానే గుర్తించడం మాత్రం చాలా ముఖ్యం.
