ఐపీఓ మార్కెట్‌‌ బిజీబిజీ.. ఈ వారం ఆరు ఇష్యూలు ఓపెన్‌‌

ఐపీఓ మార్కెట్‌‌ బిజీబిజీ.. ఈ వారం ఆరు ఇష్యూలు ఓపెన్‌‌
  •     దాదాపు రూ.5,600కోట్లు  సేకరించనున్న కంపెనీలు

న్యూఢిల్లీ:  ఐపీఓ మార్కెట్ ఈ వారం కూడా బిజీబిజీగా ఉండనుంది. గ్లోబల్ ఇన్వెస్ట్‌‌మెంట్ సంస్థ బ్లాక్‌‌స్టోన్‌‌కు వాటాలున్న హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్, జ్యుయెలరీ కంపెనీ లలితా జ్యువెలరీ మార్ట్‌‌తో  సహా మొత్తం ఆరు కంపెనీలు ఈ వారం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా దాదాపు రూ. 5,600 కోట్లను సేకరించనున్నాయి. ఈ తాజా ఇష్యూలతో ఈ ఏడాది మార్కెట్‌‌కు వచ్చిన ఐపీఓల సంఖ్య ఏకంగా 54కు చేరనుంది.

ఐపీఓల వివరాలు..

1. హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్  తమ రూ.2,600 కోట్ల ఐపీఓను  ఆగస్టు 17న ప్రారంభించనుంది.  ఒక్కో షేరును  రూ. 57 – రూ. 60 ప్రైస్ రేంజ్‌‌లో అమ్ముతారు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన ఫండ్స్‌‌ను  రుణాల చెల్లింపు కోసం ఉపయోగిస్తామని కంపెనీ చెబుతోంది. 
2.  లలితా జ్యువెలరీ మార్ట్ ఐపీఓ కూడా  ఆగస్టు 17నే  ప్రారంభం కానుంది.   ఈ ఇష్యూ ద్వారా  రూ. 1,700 కోట్లు సేకరించనున్నారు.  ఇందులో రూ. 1,200 కోట్ల ఫ్రెష్ ఇష్యూ,  రూ. 500 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌‌ఎస్‌‌) ఉన్నాయి. ప్రైస్ బ్యాండ్‌‌ను షేరుకు రూ. 190– రూ. 201 గా నిర్ణయించారు. 
3. శంకేష్ జ్యువెలర్స్ ఐపీఓ  ఆగస్టు 18న ఓపెన్‌‌ అవుతుంది. ఇష్యూ సైజ్‌‌  రూ. 367 కోట్లు. ఇందులో 2.95 కోట్ల షేర్ల ఫ్రెష్ ఇష్యూ,  1 కోటి షేర్ల  ఓఎఫ్‌‌ఎస్‌‌ ఉన్నాయి.  ఒక్కో షేరును రూ. 88– రూ. 93  రేంజ్‌‌లో అమ్ముతున్నారు. 
4. సన్‌‌షైన్ పిక్చర్స్ తమ ఐపీఓని  ఆగస్టు 18న ప్రారంభించనుంది.  ఈ   పబ్లిక్ ఇష్యూ ద్వారా  రూ. 282 కోట్లు సేకరించాలని చూస్తున్నారు. ఇందులో  48 లక్షల షేర్ల ఫ్రెష్ ఇష్యూ,  30.37 లక్షల షేర్ల ఓఎఫ్‌‌ఎస్ ఉన్నాయి. ఒక్కో షేరును  రూ. 342–రూ. 360 రేంజ్‌‌లో అమ్మనున్నారు. ప్రమోటర్లు విపుల్ అమృత్‌‌లాల్ షా, షెఫాలీ విపుల్ షా ఓఎఫ్‌‌ఎస్ ద్వారా కొంత వాటాను విక్రయిస్తున్నారు.
5.  గాజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌‌మెంట్ ఐపీఓ  ఆగస్టు 19న ప్రారంభం అవుతుంది.  ఇష్యూ సైజ్  రూ. 550 కోట్లు. ఇందులో  రూ. 450 కోట్ల ఫ్రెష్ ఇష్యూ,  రూ. 100 కోట్ల  ఓఎఫ్‌‌ఎస్ ఉన్నాయి. ప్రైస్ బ్యాండ్‌‌ను ఒక్కో షేరుకి  రూ. 152– రూ. 160గా నిర్ణయించారు. 
6.  టెంప్‌‌సెన్స్ ఇన్‌‌స్ట్రుమెంట్స్ (ఇండియా) ఐపీఓ   ఆగస్టు 20న ఓపెన్ అవుతుంది. రూ. 95 కోట్ల ఫ్రెష్ ఇష్యూతో పాటు 1.85 కోట్ల షేర్ల ఓఎఫ్‌‌ఎస్ ఉన్నాయి. ఈ ఐపీఓలన్నీ ప్రారంభమైన రోజుతో పాటు వరుసగా రెండు మార్కెట్‌ రోజులు మాత్రమే  ఓపెన్‌‌లో ఉంటాయి. 
7.   ఆగస్టు 24న ఎయిర్ లాజిస్టిక్స్ కంపెనీ  స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ రూ. 583 కోట్ల ఐపీఓను ప్రారంభం అవుతుంది.