సరిహద్దు భద్రతలో ఎస్ఎస్బీది కీలక పాత్ర.. రంగారెడ్డి జిల్లాలో జవాన్ల క్వార్టర్లు ప్రారంభం

సరిహద్దు భద్రతలో ఎస్ఎస్బీది కీలక పాత్ర.. రంగారెడ్డి జిల్లాలో జవాన్ల క్వార్టర్లు ప్రారంభం
  •   కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

ఇబ్రహీంపట్నం, వెలుగు: దేశ సరిహద్దుల్లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, అక్రమ వలసలు, నకిలీ కరెన్సీ వంటి నేరాలను సమర్థవంతంగా అడ్డుకుంటున్న ఘనత సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్​బీ) జవాన్లకే దక్కుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్  కుమార్​ తెలిపారు. 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద 50 ఎకరాల్లో సశస్త్ర సీమా బల్  ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన 48 జవాన్ల క్వార్టర్లను ఆయన ప్రారంభించారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మొక్కను నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జవాన్లు, వారి ఫ్యామిలీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కుటుంబాలు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉన్నప్పుడే జవాన్లు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా సరిహద్దు భద్రతపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉందన్నారు. జవాన్ల పిల్లలకు మెరుగైన విద్య, కుటుంబ సభ్యులకు ఆధునిక వైద్యం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆధునిక సాంకేతికతతో సరిహద్దు భద్రత నిర్వహణలో ఎస్ఎస్​బీ ముందుండడం అభినందనీయమన్నారు. 

నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు డ్రోన్లు, సీసీటీవీ నిఘా, థర్మల్  ఇమేజర్లు, నైట్  విజన్  పరికరాలు, జీపీఎస్  ఆధారిత గస్తీ, సురక్షిత డిజిటల్  కమ్యూనికేషన్, జీఐఎస్ ఆధారిత పరికరాలు వాడుతున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో వెంటనే స్పందించేందుకు ఎస్ఎస్​బీలోని 18 సహాయక, రక్షణ బృందాలు ఎప్పుడూ రెడీగా ఉంటున్నాయని తెలిపారు. సశస్త్ర సీమా బల్  డైరెక్టర్  జనరల్  సంజయ్  సింఘాల్, సీనియర్  ఆఫీసర్లు పాల్గొన్నారు.