న్యూఢిల్లీ: వచ్చే సీజన్ విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక లెజెండ్ మహేల జయవర్ధనేను తమ విమెన్స్ జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా నియమించింది. కొత్త బాధ్యతల్లో భాగంగా జట్టు వ్యూహాలు, ప్రతిభ గుర్తింపు, ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది అభివృద్ధి వంటి అన్ని క్రికెట్ వ్యవహారాలను జయవర్ధనే పర్యవేక్షిస్తాడు. ముంబై ఇండియన్స్‌తో కలిసి మూడు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన అతను ఈ కొత్త బాధ్యతలపై సంతోషం వ్యక్తం చేశాడు.
‘ఢిల్లీ క్యాపిటల్స్‌కు బలమైన గుర్తింపుతో పాటు విమెన్స్ క్రికెట్ భవిష్యత్తుపై ఆసక్తికరమైన దృక్పథం ఉంది. డబ్ల్యూపీఎల్ జట్టు క్రికెట్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉంది. జట్టులోని ప్రస్తుత బలాలను మరింత బలోపేతం చేయడం, ప్రదర్శనలో నిలకడ తీసుకురావడం, టైటిల్ కోసం పోటీపడేలా జట్టును తీర్చిదిద్దడంపై నా దృష్టి ఉంటుంది. కలిసి సాధించే విజయాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని జయవర్ధనే పేర్కొన్నాడు.
