- ములుగులో గ్రామీణ రహదారుల అభివృద్ధి పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
హనుమకొండ/ ములుగు, వెలుగు : ఉమ్మడి ఓరుగల్లు జిల్లా ఇప్పుడు ప్రగతిబాట పట్టింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి, పనులను ముమ్మం చేస్తున్నారు. ఇందులో భాగంగా ములుగు, హనుమకొండ జిల్లాల్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పర్యటన అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. మేడారంలో మంత్రులు సీతక్క, ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులలతో కలిసి వన దేవతలు సమ్మక్క – సారలమ్మ గద్దెలను సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సీఎం స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలు, భక్తులను వరుసగా కలుస్తూ వారితో మాట్లాడారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
మహిళా సంఘాలు చేపడుతున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. ‘మీరు అండగా నిలబడండి... మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. రాష్ట్రంలో పాడి పంటలు పండించుకుందాం. తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుకుందాం’ అని సీఎం పిలుపుతో ఆ ప్రాంతమంతా తామంతా మీ వెంటే అనే నినాదంతో మార్మోగింది. డిసెంబర్‌లో అక్కాచెల్లెమ్మలకు చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
