జూబ్లీహిల్స్, వెలుగు: బిజినెస్ లోన్ ఇప్పిస్తామని నమ్మించి సంతకం చేసిన చెక్కులు తీసుకొని, అనంతరం రుణం ఇవ్వకుండా ఆ చెక్కులను నగదుగా మార్చుకునేందుకు ప్రయత్నించడంతో కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
బంజారా హిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ -2లోని మెస్సర్స్ గ్లోబల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు చెందిన చెందిన మహమ్మద్ జబ్బార్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
గుజరాత్‌లోని కచ్ జిల్లా గాంధీధామ్ ప్రాంతానికి చెందిన ప్రణవ్ ఎన్.అగర్వాల్, నరసింహభాయ్ అగర్వాల్, అలాగే మెస్సర్స్ అగర్వాల్ రోడ్‌లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులు వ్యాపార అవసరాల కోసం రుణం ఇప్పిస్తామని మహమ్మద్ జబ్బార్ ను నమ్మించారు.
రుణం మంజూరు చేయడానికి షూరిటీగా ముందస్తు సంతకం చేసిన చెక్కులు ఇవ్వాలని బాధితుడిని కోరగా, అతడు సంతకం చేసిన చెక్కులను నిందితులకు అప్పగించాడు.
అయితే సదరు వ్యక్తులు రుణాన్ని ఇప్పించకపోవడంతో జబ్బార్ తన చెక్కులను తిరిగి ఇవ్వాలని కోరాడు. వారు చెక్కులు పోయాయని, వాటిని రద్దు చేశామని చెప్పారు. కానీ, ఆ తర్వాత ఆ చెక్కులను బ్యాంకులో నగదుగా మార్చుకునేందుకు అందజేశారు. నమ్మించి మోసం చేసి రూ.3 కోట్ల మేర కాజేశారని కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
