జైపూర్: కాంగ్రెస్ హెడ్డాఫీసులో నిర్వహించిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో వందేమాతరం గేయాన్ని అవమానించారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. వీడియోలో కనిపించే దానికి బీజేపీ పెడార్థం తీస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉదిత్ రాజ్ మండిపడ్డారు.
పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోగ్యం బాగాలేదని, ఆయన ఎక్కువసేపు నిల్చోలేరని తెలిపారు. దీంతో ఆయనకు కుర్చీ తీసుకురమ్మంటూ సోనియా గాంధీ అక్కడి సిబ్బందికి సైగ చేశారని వివరించారు. వాస్తవ సమస్యల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి బీజేపీ ఈ కుట్రకు తెరలేపిందని ఆరోపించారు.
బీజేపీ రాజకీయ గురువు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) జాతీయ పతాకాన్ని అసలు గుర్తించనే లేదని, పతాకం కాషాయ రంగులో ఉండాలని పట్టుబట్టిందని ఆరోపించారు. ఈ కారణంతో 52 ఏండ్ల పాటు పతాకావిష్కరణ చేయనే లేదని ఉదిత్ రాజ్ విమర్శించారు. దీనికి అమిత్షా ఎప్పుడు క్షమాపణ చెబుతారని ఆయన ప్రశ్నించారు.
