SIR పై ముంబై హైకోర్టు సీరియస్.. డ్రాఫ్ట్ లిస్ట్‌తో ఓట్ల తొలగింపుపై ECIని నిలదీత

SIR పై ముంబై హైకోర్టు సీరియస్.. డ్రాఫ్ట్ లిస్ట్‌తో ఓట్ల తొలగింపుపై ECIని నిలదీత

ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకుని ఓటర్ల పేర్లు తొలగించకూడదని బాంబే హైకోర్టు గోవా ధర్మాసనం స్పష్టం చేసింది. ఓటర్లకు తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా పేర్లు తొలగించే విధానంపై ఎన్నికల సంఘాన్ని కోర్టు ప్రశ్నించింది. సాఫ్ట్‌వేర్ నిబంధనలు చట్టాన్ని మించకూడదని పేర్కొంది.

గోవాలోని శాంటా క్రజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించడంపై దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ అమిత్ జమ్‌సాండేకర్, జస్టిస్ వాల్మీకి మెనెజెస్‌ల ధర్మాసనం విచారించింది.

పిటిషనర్లు మరో ఇంటికి మారిన తర్వాత చిరునామా మార్పు కోసం ‘ఫారం-8’ సమర్పించారు. అయితే వారి EPIC వివరాలు సిస్టమ్‌లో కనిపించకపోవడంతో ERONET సాఫ్ట్‌వేర్‌లో ‘రిజెక్ట్’ చేయడం తప్ప మరో అవకాశం కనిపించలేదని వారు కోర్టుకు తెలిపారు. అనంతరం కొత్త ఓటర్ల కోసం ఉపయోగించే ‘ఫారం-6’ సమర్పించాలని అధికారులు సూచించినట్లు చెప్పారు. అయితే తాము ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉన్నందున చిరునామా మార్పు కోసం ఫారం-8నే వర్తిస్తుందని పిటిషనర్లు వాదించారు.

►ALSO READ | 1లక్షా86 వేలకోట్లతో గ్రీన్ ఎనర్జీ కారిడార్..50 GWh బ్యాటరీ స్టోరేజ్‌కు గ్రీన్ సిగ్నల్

ఈ వ్యవహారంపై కోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. ఓటర్ల పేర్లు తొలగించే ముందు వారికి విచారణ లేదా వివరణ ఇచ్చే అవకాశం కల్పించకుండా ఏ చట్టం ఆధారంగా చర్యలు తీసుకున్నారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. అంతేకాదు ఫారం-8 దరఖాస్తులను అధికారులు పరిశీలించి, ఓటరు నిజంగా నివాసం మార్చుకున్నారా లేదా అన్నది నిర్ధారించాలని సూచించింది. ఇలాంటి సమస్యలు పెద్ద సంఖ్యలో ఓటర్లకు ఎదురైతే తీవ్ర ప్రభావం ఉంటుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.