1లక్షా86 వేలకోట్లతో గ్రీన్ ఎనర్జీ కారిడార్..50 GWh బ్యాటరీ స్టోరేజ్‌కు గ్రీన్ సిగ్నల్

1లక్షా86 వేలకోట్లతో గ్రీన్ ఎనర్జీ కారిడార్..50 GWh బ్యాటరీ స్టోరేజ్‌కు గ్రీన్ సిగ్నల్

దేశంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని మరింత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల మధ్య విద్యుత్ ప్రసార వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు భారీ స్థాయిలో బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3 (GEC-III) పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ పథకం మొత్తం వ్యయం రూ.1.86 లక్షల కోట్లు. ఇందులో రాష్ట్రాల మధ్య విద్యుత్ ప్రసార వ్యవస్థల అభివృద్ధికి రూ.1.36 లక్షల కోట్లు. 50 గిగావాట్-గంటల (GWh) బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) ఏర్పాటుకు రూ.50 వేల కోట్లు కేటాయించనున్నారు. ఈ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా 135 గిగావాట్ల వరకు రెన్యువబుల్ విద్యుత్‌ను అవసరమైన ప్రాంతాలకు తరలించవచ్చు. 

ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.54వేల082 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది. దీంతో రాష్ట్రాల్లో విద్యుత్ ప్రసార ఖర్చులు తగ్గి, వినియోగదారులపై అదనపు భారం తగ్గే అవకాశం ఉంది.  గ్రీన్ ఎనర్జీ కారిడార్ ను 2033 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి అన్ని సమయాల్లో ఒకేలా ఉండదు. అందువల్ల అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసి, అవసరమైన సమయంలో వినియోగించేందుకు BESS ఉపయోగపడుతుంది. దీంతో విద్యుత్ కొరత, గ్రిడ్‌పై ఒత్తిడి, పీక్ అవర్స్‌లో సరఫరా సమస్యలు తగ్గుతాయి. 

దీంతోపాటు ఈ పథకం ద్వారా రెన్యువబుల్ ఎనర్జీ రంగంతో పాటు తయారీ, నిర్మాణం, విద్యుత్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని కేంద్రం చెబుతోంది.