అతను రియల్ హీరో.. ఫ్లై దుబాయ్ ఫ్లైట్ పైలట్ ను ప్రశంసించిన ట్రంప్

అతను రియల్ హీరో.. ఫ్లై దుబాయ్ ఫ్లైట్ పైలట్ ను ప్రశంసించిన ట్రంప్

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో హీరో  భారత పైలట్ స్మిత్ మచ్చర్ ను ప్రధాని మోదీతో సహా ప్రపంచ నాయకులు ప్రశంసించారు. మచ్చర్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ పొగడ్తలతో ముంచెత్తారు. ఆకాశంలో ఉండగానే కో-పైలట్ దాడికి గురై తీవ్రంగా గాయపడిన స్మిత్ మచ్చర్‌ను ట్రంప్ హీరోగా అభివర్ణించారు. ప్రయాణికులను రక్షించేందుకు తీవ్ర గాయాలతో కూడా ఆయన వ్యవహరించిన తీరును ప్రశంసించారు. అదే సమయంలో దాడికి పాల్పడిన కో-పైలట్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతను ‘బహుశా ఉగ్రవాది అయి ఉండొచ్చు.. లేదా పిచ్చివాడు అయి ఉండొచ్చు’’ అని అన్నారు. 

అంతకుముందు X వేదికగా ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడికి గురై తీవ్రంగా గాయపడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసలు కురిపించారు. ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడిన మచ్చర్‌ను ఇద్దరు నేతలు  హీరోగా అభివర్ణించారు.

కెప్టెన్ మచ్చర్ ధైర్యాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన చూపిన ధైర్యం, అచంచలమైన సంకల్పం వందలాది మంది ప్రాణాలను రక్షించిందని మోదీ అన్నారు. ఓ పెను విషాదాన్ని మచ్చర్ తన ధైర్యంతో నివారించారని తెలిపారు.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా మచ్చర్‌ను ‘నిజమైన హీరో’గా అభివర్ణించారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చర్ ఎదురుతిరిగి, కాక్‌పిట్ తలుపు తెరిచారని, దీంతో ప్రయాణికులు, సిబ్బంది దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగలిగారని అన్నారు. 

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మచ్చర్‌కు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు దాడికి పాల్పడినట్లు భావిస్తున్న మరో పైలట్‌ను సౌదీ అధికారులు అరెస్టు చేశారు. దాడికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఘటనలో ఇజ్రాయెల్ పౌరులు సహా మొత్తం 174 మంది ప్రాణాలను మచ్చర్ కాపాడారని నెతన్యాహు అన్నారు. మచ్చర్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఎవరీ మచ్చర్.. 

స్మిత్ మచ్చర్‌కు వాణిజ్య విమానయానంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆయనకు సుమారు 9వేల750 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉండగా, ఎక్కువగా బోయింగ్ 737 విమానాలను నడిపారు. గతంలో స్పైస్‌జెట్‌లో సుమారు 11 ఏళ్లపాటు లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా పనిచేశారు. ఘటన క్రమంలో విమానయాన భద్రతా విధానాలను అధికారులు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాపై ఎలాంటి విశ్వసనీయమైన ముప్పు లేదని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు.