న్యూఢిల్లీ: పహల్గామ్ఉగ్రదాడి తర్వాత లష్కరే తోయిబా (ఎల్ఈటీ) టెర్రరిస్టుల ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దట్టమైన అడవుల్లో అత్యాధునిక ఆయుధాలతో, కంబాట్ దుస్తుల్లో ఉన్న నలుగురు ఉగ్రవాదులు ఉన్న ఆ పిక్స్తీవ్ర కలకలం రేపింది. పాకిస్తాన్ మద్దతుతో జమ్మూ&కాశ్మీర్లో కొన్నేళ్లుగా జరుగుతున్న మేజర్ టెర్రర్ అటాక్స్లోనూ వీరి హస్తముంది. తాజాగా మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో టాప్ కమాండర్ హషీమ్ మూసా (ఫౌజి)ను మట్టుబెట్టింది. దీంతో ఆ వైరల్ ఫొటోలో ఉన్న నలుగురు ఉగ్రవాదులు కూడా భద్రతా బలగాల చేతిలో హతమయ్యారు.
లష్కర్ కమాండర్లపై వరుస ఆపరేషన్లు
టాప్ లష్కర్ కమాండర్ హషీమ్ మూసా (ఫౌజి).. జునైద్ అహ్మద్ భట్, అబూ తల్హా (యాసిర్), సులేమాన్ షా (ఫైసల్ జట్).. ఈ నలుగురూ గగన్‌గీర్ దాడి (అక్టోబర్ 2024), పహల్గామ్ మారణహోమం (26 మంది మృతి) సహా పలు ఘోరమైన ఉగ్రదాడుల వెనుక ఉన్నారు. వీరి ఆచూకీ కోసం భద్రతా బలగాలు భారీ కూంబింగ్ నిర్వహించాయి. శ్రీనగర్‌లోని దాచిగమ్ అడవుల్లో 2024 డిసెంబర్ 3న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొదట జునైద్ భట్ హతమయ్యాడు.
ఇతడి ఫోన్ నుంచే ఈ వైరల్ ఫొటో వెలుగులోకి వచ్చింది. ఆతర్వాత ‘ఆపరేషన్ మహాదేవ్’ ద్వారా 2025 న సులేమాన్ షా, హబీబ్ తాహిర్, హంజా అఘానీలను దాచిగమ్ ప్రాంతంలో మట్టుబెట్టారు. బుద్గామ్ జిల్లాలోని యూస్మార్గ్ ఎత్తైన ప్రాంతాల్లో సెప్టెంబర్ 6న జరిగిన ‘ఆపరేషన్ అష్దర్’లో అబూ తల్హా (యాసిర్)ను చంపేశారు. చివరిగా మిగిలిన టాప్ కమాండర్ హషీమ్ మూసా కూడా తాజాగా మంగళవారం ఇండియన్ ఆర్మీ కాల్పుల్లో చనిపోవడంతో, ఆ వైరల్ ఫొటోలోని ఉగ్రవాద మూక పూర్తిగా అంతమైంది.
