- రాష్ట్రంలో కొత్తగా ఏడు మంజూరైతే ..
ఐదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే.. - 10కి చేరిన స్కూళ్ల సంఖ్య
- పేదలు, గిరిజనులకు ఉచిత విద్య మరింత చేరువ
ఆదిలాబాద్, వెలుగు: పేదలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోంది. ఆర్థిక, సామాజిక, అసమానతలకు ముగింపు పలకాలని, సామాజిక బాధ్యత, క్రమశిక్షణ, క్రీడా ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేలా అన్ని వర్గాల విద్యార్థులు కలిసి చదువుకునే వాతావరణం కల్పించాలన్నదే తమ ఉద్దేశమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
మూడు రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఐదు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేస్తూ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో గతంలో 79 స్కూళ్లును మంజూరు చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో ఏడింటిని కేటాయించింది. వీటిల్లో 5 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే కేటాయించడం విశేషం. దీంతో ఉమ్మడి జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల సంఖ్య 10కి చేరింది.
25 ఎకరాల స్థలంలో రూ.200 కోట్లతో..
ఉమ్మడి జిల్లాలో మరో ఐదు యంగ్ఇండియా స్కూళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇందుకు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో నిర్మించనున్న ఒక్కో స్కూలుకు వీలైనంత త్వరగా స్థలం సేకరించి, నిర్మాణాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ఇప్పటికే నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను వచ్చే విద్యాసంవత్సరానికి పూర్తిచేయాలనే లక్ష్యంతో పనులు స్పీడప్ చేయనున్నట్లు పేర్కొంది. కాగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గంలోని సోమన్ పల్లి, మంచిర్యాల నియోజకవర్గంలోని రెబ్బెనపల్లి, ఖానాపూర్ నియోజవర్గంలోని ఉట్నూర్ మండలం కుమ్మరి తాండ, బెల్లంపల్లి మండల కేంద్రం, ఆసిఫాబాద్ మండలంలోని వాంకిడిలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు కాగా పనులు కొనసాగుతున్నాయి.
తాజాగా మంజూరైనవి ఇక్కడే..
తాజాగా మంజూరైన వాటిలో ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనథ్ మండలంలోని బెల్గాం, బజార్హత్నూర్ మండలంలోని ఆడేగామ(కె)లో నిర్మించేందుకు స్థలాలను గుర్తించారు. నిర్మల్, ముథోల్, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.
నిరుపేద విద్యార్థులకు అత్యుత్తమ వసతులతో కూడిన నాణ్యమైన గురుకుల విద్యను అందించడమే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఉద్దేశం. ఒకే ప్రాంగణంలో చదువుతో పాటు వసతి, క్రీడలు, డిజిటల్ సౌకర్యాలు, ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నారు. పట్టణాలకు వెళ్లి చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద విద్యార్థులకు ఈ స్కూళ్లు వరంగా మారనున్నాయి.
