- ఇప్పటికే హైతాబాద్, సీతారాంపురంలో 1,580 ఎకరాల్లో పార్కులు
- కొత్తగా 418 ఎకరాలు టీజీఐఐసీకి అప్పగింత
- మరో 375 ఎకరాలు టూరిజం శాఖకు..
- ఇంకో 200 ఎకరాలు హెచ్ఎండీఏకు..
- ఎకరాకు 800 గజాల చొప్పున రైతులకు రిజిస్ట్రేషన్
చేవెళ్ల, వెలుగు:రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఇండస్ట్రియల్, టూరిజం హబ్‌గా మారుతోంది. ఇప్పటికే సీతారాంపురం, హైతాబాద్, మాచన్పల్లిలో 1,580 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, కొత్తగా మరో 993 ఎకరాలు సేకరించింది. ఇందులో 418 ఎకరాలు టీజీఐఐసీకి అప్పగించగా, పనులు ప్రారంభించేందుకు కసరత్తు మొదలైంది.
ఇండస్ట్రీస్‌తో పొల్యూషన్ పెరిగే అవకాశం ఉండడంతో పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా 340 ఎకరాలు టూరిజం డిపార్ట్మెంట్కు అప్పగించింది. మిగిలిన 200 ఎకరాలు హెచ్ఎండీకు అప్పగించి, లేఅవుట్లు చేసి బాధిత రైతులకు ఎకరాకు 800 గజాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోంది. అంతేకాదు శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ వద్ద ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ఆర్ను లింక్ చేస్తూ కోస్గి వరకు నిర్మిస్తున్న రేడియల్ రోడ్డు కూడా షాబాద్ మీదుగానే వెళ్తోంది. మండలంలోని హైతాబాద్, మాచన్ పల్లి, సోలిపేట, పెద్దవేడు, నాగర్‌కుంట, బోన్గిర్పల్లి, షాబాద్ మీదుగా కొండుర్గు మండలంలోకి ఎంటర్ అవుతోంది. అధికారులు ఇప్పటికే భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసి పనులు కొనసాగిస్తున్నారు.
ఎంజాయ్మెంట్ సర్వే ఆధారంగా భూసేకరణ
ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూమి తీసుకుంటుండగా, ఇప్పటికే దామెర్లపల్లిలో సర్వే నంబర్లు 303, 456, పెద్దవేడులో సర్వే నంబర్ 90, పోతుగల్ సర్వే నంబర్లు 93,183, హైతాబాద్ సర్వే నంబర్లు 8, 32, రేగడి దోస్వాడ సర్వే నంబర్102, తాళ్ల పల్లి సర్వే నంబర్ 483 నుంచి 993 ఎకరాలను సేకరించారు. దీంట్లో నుంచి టీజీఐఐసీ, టూరిజం డిపార్ట్మెంట్కు పోనూ మిగిలిన దాన్ని హెచ్ఎండీఏ ద్వారా లేఅవుట్లు వేసి ఒక్కో రైతుకు ఎకరాకు 800 గజాల చొప్పున కేటాయిస్తున్నారు. అయితే, చాలా మంది రైతులకు రికార్డులో ఎక్కువ విస్తీర్ణం ఉన్నప్పటికీ, కబ్జాలో మాత్రం పూర్తిగా లేదు.
కొందరు రైతులు రికార్డులో కన్నా కబ్జాలో ఎక్కువగా ఉన్నారు. అందుకే రైతుతో పాటు చుట్టుపక్కల రైతులకు నోటీసులు ఇచ్చి వారి సమక్షంలోనే ఎంజాయ్మెంట్ సర్వే చేసి సంతకాలు తీసుకుంటున్నారు. అంటే ఎంత విస్తీర్ణంలో కబ్జాలో ఉంటే అంత మేరకే నోటిఫై చేస్తున్నారు. రికార్డు, కబ్జా ఉన్నా రైతుకు ఎకరాకు 800 గజాల చొప్పున, రికార్డులో లేకున్నా కబ్జాలో ఉంటే 300 గజాల చొప్పున కేటాయిస్తున్నారు. లేఅవుట్ అనంతరం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామని అమ్ముకునే అవకాశం కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
బడా కంపెనీలు కేరాఫ్ షాబాద్
ప్రభుత్వం ఇప్పటికే చందన్వెల్లిలో 1,182, హైతాబాద్‌లో 200 ఎకరాలు, మాచన్పల్లిలో 200 ఎకరాలు సేకరించి టీజీఐఐసీ ద్వారా పలు కంపెనీలకు కేటాయించింది. చందనవెల్లిలో వెల్స్పన్ కంపెనీకు 375 ఎకరాలు, మైక్రోసాఫ్ట్ కు 52 ఎకరాలు, సీటీఆర్ఎల్ఎస్ డేటా సెంటర్‌కు 40 ఎకరాలు, ఎన్ఎక్స్ట్రా డేటాకు 40 ఎకరాలు, ఆశీర్వాద్ పైప్స్కు 25 ఎకరాలు, సీతారాంపురంలో కిటెక్స్ఆప్పరల్ పార్క్‌కు 250 ఎకరాలు, ప్రీమియం ఎనర్జీ సోలార్ లిమిటెడ్‌కు 75 ఎకరాలు కేటాయించారు.
ఈ కంపెనీలు అన్నీ కార్యకలాపాలు ప్రారంభించాయి. ప్రీమీయం ఎనర్జీ కంపెనీని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్తగా సేకరించిన 418 ఎకరాల్లోనూ బడా కంపెనీలు ఏర్పాటు కానున్నట్లు సమాచారం.
టూరిజం పరంగానూ అభివృద్ధి
ఇండస్ట్రీస్‌తో పొల్యూషన్ పెరిగే అవకాశం ఉండడంతో పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం తాళ్లపల్లి, రేగడి దోస్వాడ రెవెన్యూలో టూరిజం డిపార్ట్మెంట్కు 375 ఎకరాలు కేటాయిస్తున్నారు. ఈ గ్రామాలకు పక్కనే మూసీ నది పారుతుండడం, రెండు గ్రామాల్లో కలిసి13 చెరువులు, కుంటలు కూడా ఉండడంతో ఇక్కడ టూరిజానికి సంబంధించిన యాక్టివిటీస్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇషా ఫౌండేషన్ కు కేటాయించి టూరిజంతో పాటు ఆధ్యాత్మికత పరంగానూ అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం.
