వెల్దుర్తి, వెలుగు : దొంగతనం చేశాడన్న అనుమానంతో గ్రామస్తులు దాడి చేయడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నెవారిజలాల్‌పూర్‌లో గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం రాత్రి గ్రామంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర జరిగింది.
ఈ సమయంలో ప్రవీణ్ అనే వ్యక్తికి చెందిన సెల్‌ఫోన్ చోరీ అయింది. ఈ ఫోన్ ను అదే గ్రామానికి చెందిన బ్యాగరి రామానుజం (38) చోరీ చేశాడని అనుమానించిన ప్రవీణ్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ రామానుజం అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న వెల్దుర్తి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
