నారాయణ్ ఖేడ్, వెలుగు : ముగ్గురు కొడుకులు ఉన్నా పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో వృద్ధ దంపతులు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్టా (కే) గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన ముంగె నర్సారెడ్డి (90), అంజవ్వ (85)కు ముగ్గురు కొడుకులు. ఇద్దరు కొడుకులు హైదరాబాద్ లో ఉంటుండగా, ఒకరు గ్రామంలోనే ఉంటున్నారు. ముగ్గురు కొడుకులు పట్టించుకోకపోవడం, తిండి సైతం పెట్టకపోవడంతో దంపతులు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయినా కొడుకులు మారకపోగా.. తల్లిదండ్రులను పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. దీంతో మనస్తాపానికి గురైన నర్సారెడ్డి, అంజవ్వ బుధవారం తెల్లవారుజామున గ్రామ శివారులోని తమ పొలం వద్ద ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత చుట్టుపక్కల రైతులు గమనించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని డెడ్ బాడీలను బావి నుంచి బయటకు తీయించారు.
