- 11.32 ఎకరాలు తెలంగాణ స్టేట్ డెయిరీ..
డెవలప్ మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ పేరిట భూభారతిలో నమోదు - డెయిరీ భవనాలను ఖాళీ చేయాలని స్టేట్ డెయిరీ ఫెడరేషన్ ఎండీ నోటీసులు
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ (కరీంనగర్ డెయిరీ) భూములపై వివాదం తలెత్తింది. డెయిరీకి చెందిన భవనాలు 'ది తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్ మెంట్ కోఆరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్' కు చెందిన భూముల్లో ఉన్నాయని.. వాటిని ఖాళీ చేయాలని ఫెడరేషన్ ఎండీ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
1997 వరకు ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నిర్వహణలో ఉన్న ఈ డెయిరీ.. ఆ తర్వాత కరీంనగర్, ఆదిలాబాద్ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం లిమిటెడ్‌గా, 2003లో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (కరీంనగర్ డెయిరీ)గా మారింది.
2012లో కంపెనీల చట్టం 1956 ప్రకారం.. ఈ డెయిరీని ప్రొడ్యూసర్ కంపెనీగా మార్చారు. ఏపీ డెయిరీ ఫెడరేషన్ నుంచి విడిపోయిన టైంలో ఏపీ డెయిరీ పేరిట కరీంనగర్ లోని 1,221 సర్వే నంబర్ లో 194 ఎకరాలు ఉండగా.. ఇందులో నుంచి కరీంనగర్ డెయిరీకి 22.18 ఎకరాలను అప్పగించినట్లు డెయిరీ చైర్మన్ రాజేశ్వర్ రావు తెలిపారు.
ఇందులో 11.32 ఎకరాల భూమిని 'ది తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్' పేరు మీద భూభారతి పోర్టల్‌లో నమోదు చేయడంతో వివాదం తలెత్తింది. తమకు నోటీసులు ఇవ్వకుండానే రికార్డులు మార్చారని కరీంనగర్ డెయిరీ యాజమాన్యం ఆరోపిస్తుండగా.. మరోవైపు డెయిరీని ఖాళీ చేయాలని తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్ మెంట్ కోఆరేటివ్ ఫెడరేషన్ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.
