న్యూఢిల్లీ: యూజీసీ నెట్‌లో తప్పులు..3 సబ్జెక్టులకు రీఎగ్జామ్

న్యూఢిల్లీ: యూజీసీ నెట్‌లో తప్పులు..3 సబ్జెక్టులకు రీఎగ్జామ్

న్యూఢిల్లీ: ప్రశ్నపత్రాల్లో అసాధారణ రీతిలో తప్పుల నేపథ్యంలో యూజీసీ నెట్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ) నిర్ణయించింది. ఈమేరకు ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో రీఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జూన్​లో యూజీసీ నెట్ 87 సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించింది. అయితే, ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ క్వశ్చన్ పేపర్లలో తప్పులున్నాయని, పాత పేపర్ల నుంచి అధిక ప్రశ్నలు రిపీట్ అయ్యాయని అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. 

దీంతో ఎన్​టీఏ ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించింది. విచారణ కమిటీ పరిశీలనలో ప్రశ్నపత్రంలో ప్రశ్నలు, పేర్లు, పుస్తకాల పేర్లు, ట్రాన్స్ లేషన్, గ్రామర్,  టైపింగ్ తప్పులు ఉన్నట్లు గుర్తించింది. కొన్ని ప్రశ్నలను తొలగించడం ద్వారా సరిచేయడం సాధ్యం కాదని కమిటీ అభిప్రాయపడింది. ఈమేరకు ఎన్ టీఏకు నివేదిక సమర్పించగా.. అభ్యర్థులకు న్యాయం చేసేందుకు ఈ మూడు సబ్జెక్టుల పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ఎన్ టీఏ నిర్ణయించింది.