KBR పార్కు చుట్టూ గుంతలు పూడ్చివేత.. అండర్పాస్లు, స్టీల్బ్రిడ్జి రద్దుతో నిర్ణయం

KBR పార్కు చుట్టూ గుంతలు పూడ్చివేత.. అండర్పాస్లు, స్టీల్బ్రిడ్జి రద్దుతో నిర్ణయం
  • ఎలివేటెడ్‌‌‌‌ కారిడార్‌‌‌‌ నిర్మాణంపై దృష్టి
  • ముఫఖం జా కాలేజ్‌‌‌‌ నుంచి చెక్‌‌‌‌పోస్ట్‌‌‌‌ వరకు ఆరు లేన్ల బై డైరెక్షనల్‌‌‌‌ ఎలివేటెడ్‌‌‌‌ కారిడార్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌ సిటీ, వెలుగు: కేబీఆర్‌‌‌‌ పార్క్‌‌‌‌ చుట్టూ అండర్‌‌‌‌పాస్‌‌‌‌లు, స్టీల్‌‌‌‌ బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన పాత ప్రణాళిక రద్దు కావడంతో తవ్విన గుంతలను పూడ్చుతున్నారు. అగ్రసేన్‌‌‌‌ మహారాజ్‌‌‌‌ జంక్షన్‌‌‌‌ వద్ద అండర్‌‌‌‌పాస్‌‌‌‌ల కోసం తవ్విన రెండు భారీ గుంతలను ట్రాక్టర్లు, ట్రక్కుల ద్వారా మట్టిని తరలించి పూడ్చివేస్తున్నారు. 

గుంతలను పూర్తిగా పూడ్చి రోడ్డుకు సమాంతరంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇతర ప్రాంతాల్లో అండర్‌‌‌‌పాస్‌‌‌‌ల కోసం తవ్విన గుంతలను కూడా దశలవారీగా పూడ్చనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

రూ.1,090 కోట్ల ప్రణాళిక రద్దుతో..
కేబీఆర్‌‌‌‌ పార్క్‌‌‌‌ చుట్టూ ట్రాఫిక్‌‌‌‌ సమస్య పరిష్కారానికి గతంలో రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో ఏడు స్టీల్‌‌‌‌ బ్రిడ్జిలు, ఏడు అండర్‌‌‌‌పాస్‌‌‌‌ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. అయితే పార్క్‌‌‌‌ చుట్టూ వన్‌‌‌‌వే విధానం అమలు చేయగా ట్రాఫిక్‌‌‌‌ రద్దీ తగ్గడంతో ఆ ప్రణాళికను పునఃపరిశీలించారు.

దీంతో పాత ప్రతిపాదనను రద్దు చేసి ఎలివేటెడ్‌‌‌‌ కారిడార్‌‌‌‌ నిర్మాణంపై దృష్టి సారిస్తున్నారు. బంజారాహిల్స్‌‌‌‌లోని ముఫఖం జా కాలేజ్‌‌‌‌ నుంచి జూబ్లీహిల్స్‌‌‌‌ చెక్‌‌‌‌పోస్ట్‌‌‌‌ వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల బై డైరెక్షనల్‌‌‌‌ ఎలివేటెడ్‌‌‌‌ కారిడార్‌‌‌‌ నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం సుమారు రూ.751 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పాత ప్రణాళికలో ఏడు అండర్‌‌‌‌పాస్‌‌‌‌లు, ఏడు స్టీల్‌‌‌‌ బ్రిడ్జిలతో పాటు భూసేకరణకే సుమారు రూ.1,040 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. కొత్త ప్రతిపాదనలో భూసేకరణ వ్యయం రూ.300 కోట్లలోపే ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పార్క్‌‌‌‌ హయత్‌‌‌‌, కేబీఆర్‌‌‌‌ మెయిన్‌‌‌‌ గేట్‌‌‌‌ వద్ద నిర్మించిన పిల్లర్లను కొత్త ఎలివేటెడ్‌‌‌‌ కారిడార్‌‌‌‌లో వినియోగించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీంతో పాత పనుల్లో వినియోగించిన నిర్మాణాలను సాధ్యమైన మేరకు కొత్త ప్రాజెక్టులో ఉపయోగించుకునే అవకాశం ఉంది.