అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత..సంక్షేమ బోర్డుల ఏర్పాటుకు సర్కార్ కసరత్తు

అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత..సంక్షేమ బోర్డుల ఏర్పాటుకు సర్కార్ కసరత్తు
  • ఇండ్లల్లో పనిచేసే మహిళలు, హమాలీల సంక్షేమం కోసం నూతన చట్టాల రూపకల్పన
  • రాష్ట్రంలో 47.28 లక్షలకు చేరిన ఈ-శ్రమ్ పోర్టల్ నమోదు వివరాలు
  • ఫార్మా, కెమికల్ ఫ్యాక్టరీల్లో ప్రమాదాలకు చెక్‌‌‌‌ పెట్టేలా చర్యలు
  • కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌సోర్సింగ్ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యాలు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికులు, శ్రామిక మహిళల సామాజిక భద్రత కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇండ్లల్లో పనిచేసే మహిళా కార్మికులకు ‘ప్రత్యేక బోర్డు’, మార్కెట్లు, గోదాముల్లో పనిచేసే వారి కోసం ‘హమాలీ బోర్డు’తోపాటు కొత్త చట్టం తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. అదే సమయంలో ఫ్యాక్టరీలపై నిఘా ఉంచేందుకు ‘పారిశ్రామిక భద్రత, సేఫ్టీ బోర్డు’ను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియను వేగవంతం చేసింది.

ఈ క్రమంలోనే సంక్షేమ ఫలాలను నేరుగా కార్మికుల ముంగిటకు చేర్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ ఈ–శ్రమ్ పోర్టల్‌‌‌‌లో నమోదవుతున్న కార్మికుల వివరాలను కార్మిక శాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో ఈ–శ్రమ్ పోర్టల్ ద్వారా ఆగస్టు 31 నాటికి అసంఘటిత కార్మికుల నమోదు సంఖ్య రికార్డు స్థాయిలో 47.28 లక్షలకు చేరినట్లు లేబర్ కమిషనరేట్ నివేదిక వెల్లడించింది. జిల్లాల్లోని కార్మిక శాఖ కార్యాలయాల ద్వారా విస్తృతంగా ప్రత్యేక రిజిస్ట్రేషన్ క్యాంపులు నిర్వహిస్తూ వివిధ రంగాల శ్రామికులను ఈ డేటాబేస్ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

మూడు నెలల్లోనే కొత్తగా 48 వేల మంది..

రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికుల నమోదు ప్రక్రియ గత కొన్ని నెలలుగా స్థిరమైన పురోగతిని నమోదు చేస్తోంది. కార్మిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ నాటికి ఈ–శ్రమ్ పోర్టల్‌‌‌‌లో నమోదైన కార్మికుల సంఖ్య 46.80 లక్షలుగా ఉండగా, జులై నాటికి అది 47.16 లక్షలకు చేరింది. ఇక ఆగస్టు 31 నాటికి ఈ సంఖ్య ఏకంగా 47.28 లక్షలకు ఎగబాకింది. అంటే గత మూడు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 48 వేల మంది కొత్త అసంఘటిత కార్మికులు ఈ సామాజిక భద్రతా వేదికపై పేర్లు నమోదు చేసుకున్నారు.

క్షేత్రస్థాయిలో జిల్లా కార్మిక కార్యాలయాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాల ద్వారా ఈ నమోదు కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ముఖ్యంగా అత్యంత ప్రమాదకర వాతావరణంలో పనిచేసే భవన నిర్మాణ కార్మికులు, రవాణా రంగ డ్రైవర్లు, క్లీనర్లు, ఇండ్లల్లో పనిచేసే మహిళా గృహ కార్మికులు, ఆన్‌‌‌‌లైన్ ఆధారిత గిగ్ వర్కర్ల నమోదుకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోంది.

వీరిందరికీ త్వరలోనే కొత్తగా ఏర్పాటు చేయబోయే బోర్డుల ద్వారా సంక్షేమ ప్రయోజనాలు అందించనున్నారు. ఈ–శ్రమ్ పోర్టల్‌‌‌‌లో నమోదవుతున్న కార్మికుల డేటా ప్రామాణికత, పారదర్శకత కోసం లేబర్ కమిషనరేట్ విభాగం నూతన సాంకేతిక వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. కార్మికుల వివరాల్లో ఎలాంటి లోపాలు లేకుండా నెలవారీ బేస్‌‌‌‌లైన్‌‌‌‌ను పటిష్టం చేసేందుకు మూడు అంచెల పర్యవేక్షణ విధానాన్ని అమలు చేస్తున్నారు.

మహిళా శ్రామికుల కోసం ప్రత్యేక బోర్డు..

రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లోని ఇండ్లల్లో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న లక్షలాది మంది మహిళా శ్రామికుల కోసం ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డును ప్రతిపాదించింది. నిర్ణీత పని గంటలు, కనీస వేతనాలు, సెలవులు లేక నిత్యం ఆర్థిక దోపిడీకి గురవుతున్న గృహ కార్మికులకు (డొమెస్టిక్ వర్కర్స్) అధికారికంగా గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. బోర్డు ద్వారా ప్రమాద బీమా, అనారోగ్య సమయాల్లో వైద్య సాయం, ప్రసూతి ప్రయోజనాలు కల్పించేలా విధివిధానాలు ఖరారు చేస్తున్నారు.

అంతేకాకుండా పనిచేసే ఇండ్లల్లో వేధింపులు, వేతనాల వివాదాలు తలెత్తితే పరిష్కరించేందుకు బోర్డు పరిధిలోనే ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మహిళా కార్మికులకు సంబంధించి ఇప్పటివరకు స్పష్టమైన రికార్డులు లేకపోవడంతో, స్థానిక సంస్థల సహకారంతో వార్డులవారీగా సర్వే జరిపి ఈ–శ్రమ్ గుర్తింపు సంఖ్యతో మ్యాపింగ్ చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పిల్లల స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌లు నేరుగా మహిళా కార్మికుల బ్యాంక్ ఖాతాల్లోకే చేరనున్నాయి.

హమాలీలందరికీ చట్టబద్ధమైన హక్కులు..

వ్యవసాయ మార్కెట్ యార్డులు, రైల్వే గూడ్స్ షెడ్లు, ఎఫ్‌‌‌‌సీఐ గోదాములు, ట్రాన్స్‌‌‌‌పోర్ట్ హబ్‌‌‌‌ల్లో బస్తాలు మోసే హమాలీల సంక్షేమానికి మహారాష్ట్ర ‘మథాడి’ చట్టం తరహాలో ప్రత్యేక చట్టంతోపాటు ‘హమాలీ సంక్షేమ బోర్డు’ను ఏర్పాటు చేయనున్నారు. రోజంతా బరువులు మోస్తూ వెన్నెముక, శ్వాసకోశ, కీళ్ల నొప్పులతో బాధపడే హమాలీలకు ప్రత్యేక ఆరోగ్య రక్షణ కల్పించనున్నారు.

మార్కెట్లు, గోదాముల్లో సరుకుల లోడింగ్, అన్‌‌‌‌లోడింగ్ వ్యాపార లావాదేవీలపై నామమాత్రపు సెస్ లేదా లెవీని వసూలు చేసి, ఆ నిధులను నేరుగా హమాలీ సంక్షేమ నిధికి జమ చేసేలా ఆర్థిక నమూనాను రూపొందిస్తున్నారు. పని ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు అంగవైకల్యం పాలైనా, మరణించినా కుటుంబాలకు ఆర్థిక పరిహారం అందించే నిబంధనలను నూతన చట్టంలో పొందుపరుస్తున్నారు. ఈ బోర్డు ద్వారా హమాలీలందరికీ వయసు పైబడిన తర్వాత పింఛన్ పొందేలా చట్టబద్ధమైన హక్కులను కల్పించేందుకు కార్మిక శాఖ ముసాయిదాను రూపొందిస్తోంది

అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు సేఫ్టీ బోర్డు..

ఫార్మా, కెమికల్ హబ్‌‌‌‌ల్లో తరచూ చోటు చేసుకుంటున్న రియాక్టర్ పేలుళ్లు, అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ‘పారిశ్రామిక భద్రత, సేఫ్టీ బోర్డు’ను సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్రంగా పునర్వ్యవస్థీకరించనున్నారు. కెమికల్ ఫ్యాక్టరీల్లో ప్రమాదకర రసాయనాల నిల్వ, రియాక్టర్ల సామర్థ్యం, అత్యవసర మార్గాలు, రక్షణ పరికరాల వినియోగంపై నిరంతర ఆడిట్ జరిపేందుకు నిపుణులతో కూడిన ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించనున్నారు.

పరిశ్రమల్లో లోపాలు గుర్తిస్తే కేవలం నోటీసులతో సరిపెట్టకుండా, అవసరమైతే ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసేలా సేఫ్టీ బోర్డుకు చట్టబద్ధమైన కఠిన అధికారాలు కట్టబెట్టనున్నారు. కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌సోర్సింగ్ కార్మికులకు సైతం యాజమాన్యాలే సేఫ్టీ ట్రైనింగ్, ప్రమాద బీమా సౌకర్యాలు తప్పనిసరిగా అందించాలని నిబంధనలు విధిస్తున్నారు. ఈ సంస్కరణలన్నింటిపై విధాన పత్రాలు సిద్ధం చేసి, క్యాబినెట్ ఆమోదం తీసుకునేందుకు శక్తి శాఖ సన్నాహాలు చేస్తోంది.