రూ.2 కోట్లు తీసుకొని రౌడీషీటర్ కు బెయిల్ ఇప్పించిండ్రు ..చంచల్‌‌‌‌గూడ జైలు సూపరింటెండెంట్‌‌‌‌పై అసదుద్దీన్‌‌‌‌ ఆరోపణలు

రూ.2 కోట్లు తీసుకొని రౌడీషీటర్ కు బెయిల్ ఇప్పించిండ్రు ..చంచల్‌‌‌‌గూడ జైలు సూపరింటెండెంట్‌‌‌‌పై అసదుద్దీన్‌‌‌‌ ఆరోపణలు

హైదరాబాద్, వెలుగు: చంచల్‌‌‌‌గూడ సెంట్రల్​జైల్ సూపరింటెండెంట్‌‌‌‌పై హైదరాబాద్‌‌‌‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌‌ అసదుద్దీన్‌‌‌‌ ఒవైసీ సంచలన ఆరోపణలు చేశారు. న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్‌‌‌‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ రౌడీషీటర్‌‌‌‌.. జైలు సూపరింటెండెంట్‌‌‌‌కు రూ.2 కోట్లు లంచంగా ఇచ్చి బెయిల్‌‌‌‌ పొందాడని ఆరోపించారు. బెయిల్‌‌‌‌పై విడుదలైన అనంతరం సదరు వ్యక్తి మరోసారి దాడులకు కుట్ర చేస్తున్నాడని చెప్పారు. హైదరాబాద్‌‌‌‌లో మిలాద్‌‌‌‌-ఉన్‌‌‌‌-నబీ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జైలులో ఉన్న హత్య కేసు నిందితులు బయటి వ్యక్తులతో సంబంధాలు కొనసాగిస్తూ తదుపరి దాడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆరోపించారు. అమాయకులపై హత్యలు, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌ చేశారు.   

ఆరోపణలు నిరాధారం: జైళ్ల శాఖ-

చంచల్‌‌‌‌గూడ జైల్ సూపరింటెండెంట్‌‌‌‌ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జైళ్ల శాఖ తీవ్రంగా ఖండించింది. ఆయన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, అసత్యమైనని పేర్కొంది. బెయిల్‌‌‌‌ మంజూరు ప్రక్రియ న్యాయస్థానం పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. ఇందులో జైలు అధికారులకు ఎలాంటి పాత్ర ఉండదని వెల్లడించింది. న్యాయస్థానాలు జారీ చేసే ఆదేశాలను మాత్రమే జైలు అధికారులు నిబంధనల ప్రకారం అమలు చేస్తారని పేర్కొంది.

ఆరోపణలకు సంబంధించి నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువస్తే, చట్ట ప్రకారం విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. జైలులో ఖైదీల అనధికారిక సమావేశాలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన ఖైదీలు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జైలు సౌకర్యాలను ఉపయోగించి జైలు వెలుపల దాడులకు ప్రణాళికలు రచించడం, సమన్వయం చేయడం అనుమతించే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించింది.