ఒకే ప్రాపర్టీ ఐడీ.. ఒకే బిల్లు .. రిజిస్ట్రేషన్‌‌‌‌తోనే ఆటోమేటిక్‌‌‌‌గా మ్యుటేషన్

ఒకే ప్రాపర్టీ ఐడీ.. ఒకే బిల్లు .. రిజిస్ట్రేషన్‌‌‌‌తోనే ఆటోమేటిక్‌‌‌‌గా మ్యుటేషన్
  • సీఎం నేతృత్వంలో ‘అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్’ 
  • సరి‘కొత్త’గా క్యూర్‌‌‌‌.. నగరానికి పక్కా కేర్ 
  • ఆస్తి పన్ను పెంపుపై 10%  సీలింగ్
  • ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే భవన నిర్మాణ అనుమతులు
  • చెరువులు, నాలాల పరిరక్షణ కోసం 
  • ‘హైడ్రా’కు చట్టబద్ధమైన అధికారాలు
  • టాంగాలు, ఒంటెల పన్నులు రద్దు
  • వందకు పైగా పాత నిబంధనలకు చెల్లుచీటీ

హైదరాబాద్, వెలుగు: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఒకే ప్రాపర్టీ ఐడీ, ఒకే బిల్లు విధానం అమల్లోకి వచ్చింది. రిజిస్ట్రేషన్‌‌ అయిన తర్వాత మళ్లీ ప్రత్యేకంగా అప్లై చేసుకోకుండానే ఆటోమేటిక్‌‌గా మ్యూటేషన్ జరగనుంది. ఆస్తిపన్ను పెంపుపై 10 శాతం సీలింగ్, ఆన్‌‌లైన్‌‌లోనే భవన నిర్మాణ అనుమతులు, చెరువులు-, నాలాల పరిరక్షణకు హైడ్రాకు చట్టబద్ధమైన అధికారాలు కల్పిస్తూ రూపొందించిన నూతన ‘కోర్‌‌ అర్బన్‌‌ రీజియన్‌‌ (ఇంటిగ్రేటెడ్‌‌ గవర్నెన్స్‌‌) చట్టం–2026’ (క్యూర్‌‌) కార్యరూపం దాల్చింది. సీఎం రేవంత్‌‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ‘క్యూర్‌‌ అపెక్స్‌‌ గవర్నెన్స్ కౌన్సిల్’ పర్యవేక్షణలో పనిచేసే ఈ నూతన వ్యవస్థ ద్వారా 70 ఏండ్ల నాటి పాత జీహెచ్‌‌ఎంసీ చట్టంలోని వందకుపైగా కాలం చెల్లిన నిబంధనలకు ప్రభుత్వం శాశ్వతంగా చెల్లుచీటి పలికింది.

పౌరులకు మున్సిపల్ సేవలను సులభతరం చేసేందుకు ఆస్తి రిజిస్ట్రేషన్, సేవల విధానంలో నూతన చట్టం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఆస్తి కొనుగోలు పూర్తై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌‌ జరిగిన వెంటనే ఎలాంటి ప్రత్యేక దరఖాస్తులు లేకుండానే ఆటోమేటిక్‌‌గా మ్యూటేషన్‌‌ పూర్తయ్యే సమీకృత విధానాన్ని అమల్లోకి తెచ్చారు. నగర పరిధిలోని ప్రతి స్థిరాస్తికి ఆధార్ తరహాలో ప్రత్యేకంగా ‘ఇంటిగ్రేటెడ్‌‌ ప్రాపర్టీ ఐడెంటిటీ కోడ్‌‌’ను కేటాయిస్తారు.భవనానికి సంబంధించిన ప్లాన్ అనుమతులు, నీటి కనెక్షన్, ఇతర మున్సిపల్ రికార్డులన్నీ ఈ గుర్తింపు సంఖ్యతోనే అనుసంధానమవుతాయి.

ఇప్పటివరకు వేర్వేరుగా వస్తున్న ఆస్తి పన్ను, తాగునీటి సరఫరా బిల్లు, మురుగునీటి పారుదల చార్జీలు, పారిశుధ్య బకాయిలన్నింటినీ కలిపి ‘క్యూర్‌‌–1’ పేరుతో ఇకపై ఒకే ఇంటిగ్రేటెడ్ బిల్లును జారీ చేయనున్నారు. పౌరులు కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా మున్సిపల్ సేవలు, నివాస-వాణిజ్య అనుమతులు, ట్రేడ్ లైసెన్సులను ఒకే ఉమ్మడి పోర్టల్‌‌ ద్వారా పొందేలా డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.

‘నైట్‌‌ ఎకానమీ జోన్ల’ నోటిఫై

భవన నిర్మాణ అనుమతుల మంజూరు ప్రక్రియను పూర్తిగా మానవ ప్రమేయం లేని పారదర్శక ఆన్‌‌లైన్ విధానంలోకి మార్చారు. నిర్దేశిత సమయంలోగా సంబంధిత అధికారులు దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకోకపోతే, ఆ దరఖాస్తు ఆటోమేటిక్‌‌గా పైస్థాయి అధికారి లాగిన్‌‌కు బదిలీ అవుతుంది. చట్టప్రకారం నిర్ణీత గడువులోగా ఎలాంటి నిర్ణయం వెలువడని పక్షంలో దరఖాస్తుదారుడికి ‘డీమ్డ్‌‌ అప్రూవల్‌‌’ కింద అనుమతి లభించినట్టుగానే పరిగణిస్తారు. నగరంలో వాణిజ్య కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు రాత్రివేళల్లో ఎక్కువ సమయం వ్యాపారాలు కొనసాగేలా ప్రత్యేకంగా ‘నైట్‌‌ ఎకానమీ జోన్ల’ను ప్రభుత్వం నోటిఫై చేయనుంది. చిన్నపాటి నిబంధనల ఉల్లంఘనలపై క్రిమినల్ కేసులు నమోదు చేసే పాత విధానాన్ని రద్దు చేసి, వాటి స్థానంలో సివిల్ జరిమానాల విధానాన్ని తెచ్చారు. ప్రతి ఉల్లంఘనపై చర్య తీసుకునే ముందు తప్పనిసరిగా షోకాజ్ నోటీసు జారీ చేసి, వివరణ తీసుకున్న తర్వాతే జరిమానా విధించే నిబంధనను చేర్చారు.

రోడ్ల కోసం యుటిలిటీ కోఆర్డినేషన్‌‌ కమిటీ

క్యూర్​ పరిధిలో ఒక శాఖ వేసిన రోడ్డును ఇతర శాఖలు కొద్దిరోజులకే తవ్వేసే సమస్యకు అడ్డుకట్ట వేస్తూ ‘యుటిలిటీ కోఆర్డినేషన్‌‌ కమిటీ’ని రంగంలోకి దించారు. వివిధ శాఖల భూగర్భ కేబుళ్లు, డ్రైనేజీ పైపులైన్ల పనుల సమన్వయం ఈ కమిటీ అనుమతితోనే జరగాలి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పాదచారుల రక్షణ కోసం ‘క్యూర్‌‌ ట్రాఫిక్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ అండ్‌‌ రోడ్‌‌ సేఫ్టీ అథారిటీ’ ఏర్పాటవుతున్నది. పాఠశాలల వద్ద ప్రత్యేకంగా ‘సేఫ్ స్కూల్ జోన్లు’ ఏర్పాటు చేస్తారు. చెరువులు, నాలాలు, పార్కులు, బహిరంగ స్థలాల రక్షణకు హైడ్రా   విభాగానికి నూతన చట్టం ద్వారా పూర్తిస్థాయి చట్టబద్ధమైన అధికారాలను కల్పించారు. విపత్తులను ఎదుర్కొనేందుకు ‘క్యూర్‌‌ డిజాస్టర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ అథారిటీ’ పనిచేస్తుంది. నిబంధనలు పాటించని భవనాలకు ఫైర్ ఆడిట్ తప్పనిసరి చేయడంతోపాటు ప్రమాదకర నిర్మాణాలను సీజ్ చేసే అధికారాన్ని కల్పించారు.

ప్రతి కార్పొరేషన్‌‌లో జెండర్‌‌‌‌ ఇన్‌‌క్లూజన్‌‌ సెల్​

నగర మౌలిక వసతుల కల్పనలో మహిళలు, వృద్ధులు, ట్రాన్స్‌‌జెండర్లు, గిగ్ కార్మికులకు చట్టంలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. ప్రతి కార్పొరేషన్‌‌లో ‘జెండర్‌‌ ఇన్‌‌క్లూజన్‌‌ సెల్‌‌’ ఏర్పాటు చేయడంతోపాటు పాలకమండలిలో ట్రాన్స్‌‌జెండర్ వర్గానికి చెందిన ఒకరికి ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ఆన్‌‌లైన్ డెలివరీ బాయ్స్‌‌లాంటి గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక విశ్రాంతి గదులు, తాగునీరు, పారిశుధ్య వసతులు, ఈ –-వాహనాల చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. వీధి వ్యాపారుల కోసం వెండింగ్ జోన్లలో సౌకర్యాలు కల్పిస్తారు. మరోవైపు 70 ఏండ్లనాటి పాత చట్టంలో ఉన్న వందకు పైగా అర్థరహిత నిబంధనలను ప్రభుత్వం రద్దు చేసింది. టాంగాలు, జట్కాలు, ఎడ్ల బండ్లు, గుర్రాలు, ఒంటెలు, ఏనుగులపై పన్నులు వసూలు చేసే నిబంధనలను తొలగించారు. సరుకుల రవాణాపై పాత ఆక్ట్రాయ్ పన్నులు, ఆవిరి ఇంజిన్ల విజిళ్ల వాడకంపై అనుమతులు, రూ.5 నుంచి రూ.20 వరకు ఉండే కాలం చెల్లిన జరిమానాల పద్ధతులకు నూతన చట్టంతో ముగింపు పలికారు.

 ఆస్తి పన్ను లెక్కింపు విధానంలో శాస్త్రీయ మార్పులు

ఆస్తిపన్ను లెక్కింపు విధానంలో శాస్త్రీయ మార్పులు చేస్తూ పాత వార్షిక అద్దె విలువ పద్ధతి స్థానంలో రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించే భూముల గైడ్‌‌లైన్‌‌ విలువల ఆధారిత విధానాన్ని అమల్లోకి తెచ్చారు. పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట కల్పిస్తూ 375 చదరపు అడుగుల లోపు ఉండే చిన్న నివాస ఆస్తులకు ప్రస్తుతం ఉన్న రూ.101 నామమాత్రపు పన్నును యథాతథంగా కొనసాగించనున్నారు. మిగిలిన నివాస భవనాలకు గైడ్‌‌లైన్‌‌ విలువపై 0.10 శాతం నుంచి 0.50 శాతం మధ్య, వాణిజ్య ఆస్తులకు 0.20 శాతం నుంచి 2 శాతం మధ్య పన్ను రేట్లను ఆయా కార్పొరేషన్లు ఖరారు చేస్తాయి. కొత్త రేట్లు ఖరారయ్యే వరకు నివాసాలకు 0.15 శాతం, వాణిజ్య ఆస్తులకు 0.75 శాతం ప్రాథమిక రేటుగా వర్తిస్తుంది. పన్ను విధానం మారినప్పటికీ ఒకేసారి భారం పడకుండా చట్టంలో రక్షణ కల్పించారు. వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టి పర్యావరణహితంగా ఉండే ఆస్తులకు ఆస్తి పన్నులో ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నారు.