ఆదిలాబాద్, వెలుగు: ఈ నెల రెండో వారం నుంచే ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషతో కలిసి పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం పత్తి కొనుగోలు ప్రారంభించే తేదీ ఖరారు చేసి రైతులకు సమాచారం అందిస్తామని తెలిపారు.
ఈసారి ఏఈవోల వద్ద మాయిశ్చర్ మీటర్‌ను అందుబాటులో ఉంచామని, రైతులు అక్కడికి వెళ్లి తేమ శాతం చెక్ చేసుకొని మార్కెట్‌కు పత్తి తీసుకురావాలని సూచించారు. మార్కెట్ యార్డులో రైతులకు తాగునీరు, మరుగుదొడ్లు, భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర రైతుల పత్తి కొనుగోలు కోసం ప్రత్యేకంగా కొన్ని జిన్నింగ్ మిల్లులను కేటాయించి, ఇరు ప్రాంత రైతుల మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా మార్కెటింగ్ అధికారి గజానన్, సెక్రటరీ విఠల్ పాల్గొన్నారు.
