- 7,500 మందికి పైగా అథ్లెట్లు
- సీఎం రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా ఆర్గనైజింగ్ కమిటీ..
- ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ ?
- డిసెంబర్ 11 నుంచి 22 వరకు 8వ ఎడిషన్ క్రీడా సంబరం
- హుస్సేన్‌సాగర్‌లో వాటర్ స్పోర్ట్స్.. రోయింగ్, సెయిలింగ్ ప్రత్యేక ఆకర్షణ
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన 8వ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026’ పోటీలకు తెలంగాణ సిద్ధమవుతున్నది. డిసెంబర్ 11 నుంచి 22 వరకు రాష్ట్రంలో మెగా క్రీడోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ నగరాల పరిధిలో మొత్తం 27 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి.
దేశవ్యాప్తంగా 7,500 మందికి పైగా క్రీడాకారులు, 1,500 మంది సహాయక సిబ్బంది(కోచ్‌లు, మేనేజర్లు), వెయ్యి మందికి పైగా సాంకేతిక అధికారులు పాల్గొననున్నారు. డిసెంబర్ 11న గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఓపెనింగ్సెరోమనీ, డిసెంబర్ 22న ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో ముగింపు వేడుకలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ గెస్ట్‌గా హాజరయ్యే అవకాశం ఉందని రాష్ట్ర అధికార వర్గాలు వెల్లడించాయి.
సంప్రదాయ, ఆధునిక క్రీడల మేళవింపు..
పోటీల నిర్వహణను రాజధానికే పరిమితం చేయకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల క్రీడాభిమానులను భాగస్వాములను చేసేలా వివిధ జిల్లాలకు వేదికలను వికేంద్రీకరించారు. హనుమకొండలో అథ్లెటిక్స్, కరీంనగర్‌లో జూడో, ఖమ్మంలో ఆర్చరీ, మహబూబ్‌నగర్‌లో కబడ్డీ, నిజామాబాద్‌లో టేబుల్ టెన్నిస్ పోటీలు జరగనున్నాయి.
మిగిలిన ప్రధాన క్రీడాంశాలన్నింటినీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, జేఎన్‌టీయూహెచ్ కాంప్లెక్స్, సికింద్రాబాద్, యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియాల్లో నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో హుస్సేన్‌సాగర్ వాటర్ స్పోర్ట్స్ సెంటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
సహజసిద్ధమైన నీటి వనరుగా ఉన్న హుస్సేన్‌సాగర్‌లో రోయింగ్, కయాకింగ్, కానోయింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ ఈవెంట్లను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ 8వ ఎడిషన్ క్రీడల్లో తెలంగాణ సంస్కృతి, భౌగోళిక అంశాలను ప్రతిబింబించేలా ప్రత్యేక క్రీడలను పొందుపరిచారు. తెలంగాణ ఆతిథ్య క్రీడగా రోయింగ్‌ను, సెయిలింగ్‌ను ప్రత్యేక ప్రదర్శన క్రీడగా నిర్వహించనున్నారు. ఎడిషన్ క్రీడగా సాఫ్ట్‌బాల్‌ను చేర్చారు.
అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, హాకీ, జూడో, ఖో-ఖో, కబడ్డీ, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ అంశాల్లో పోటీలు సాగనున్నాయి. వీటితో పాటు భారతీయ సాంప్రదాయ యుద్ధ విద్యలు, క్రీడలైన గట్కా, మల్లఖంబ్, కలరిపయట్టు, థాంగ్-టా, యోగాసన పోటీలను అధికారికంగా నిర్వహించనున్నారు.
5 ఉన్నత స్థాయి కమిటీలు..
ఖేలో ఇండియా క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఐదు ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. మొత్తం పోటీల నిర్వహణను పర్యవేక్షించే ఆర్గనైజింగ్ కమిటీకి సీఎం రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా, కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కో-చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చే వేలాది మంది అథ్లెట్లు, ప్రముఖులకు వసతి, నాణ్యమైన భోజనం, స్థానిక రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ కమిటీని రంగంలోకి దించారు.
హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో ఎంపిక చేసిన10 ప్రధాన క్రీడా వేదికల్లో రూపురేఖలు మార్చేందుకు 12 రకాల ఆధునీకరణ పనులను అధికారులు చేపట్టారు. రాబోయే రెండు నెలల్లో క్రీడాకారుల విశ్రాంతి గదులు, ప్రేక్షకుల గ్యాలరీలు, శానిటేషన్ వ్యవస్థలు, స్విమ్మింగ్ పూల్స్, సైక్లింగ్ వెలోడ్రోమ్ ట్రాక్‌లు, షూటింగ్ రేంజ్‌ల మరమ్మతులు, అంతర్జాతీయ ప్రమాణాల ఆధునీకరణ పనులను పూర్తి చేయాలని గడువు విధించారు.
