హైదరాబాద్, వెలుగు: ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిక జరగకుండా కోర్టు పిటిషన్లతో అడ్డుకుంటోందని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. కాంగ్రెస్‌కు తమ పాలనపై నమ్మకం ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ పోటీ చేయించాలని సవాల్ చేశారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక జరిగితే బీజేపీ గెలుస్తుందనే భయంతోనే కాంగ్రెస్ ఎన్నికను అడ్డుకుంటోందన్నారు.
గతంలో ఈ స్థానాన్ని బీజేపీ గెలుచుకుందని, మరోసారి అక్కడ తమ పార్టీకి ప్రజల మద్దతు ఉంటుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరుపై ఖైరతాబాద్ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఇప్పుడు నియోజకవర్గాల్లో తమ పార్టీ ఏదో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదని, రెండు పార్టీలు లోపాయికారీ ఒప్పందాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నాయని ఆరోపించారు.
గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనతో రాష్ట్రం అప్పులపాలైందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ప్రజలు రాబోయే రోజుల్లో తగిన సమాధానం చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.
