- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంపై చర్చ
హైదరాబాద్, వెలుగు: గుజరాత్లో ఇవాల్టి(సోమవారం) నుంచి 2 రోజుల పాటు జరిగే ‘చింతన్ శివిర్ 2026’ వర్క్ షాప్‌లో పాల్గొనడానికి ఆదివారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డితో పాటు ఆర్అండ్ బీ శాఖ ఆఫీసర్లు బయల్దేరి వెళ్లారు. గుజరాత్ లోని నర్మదా జిల్లా ఎక్తానగర్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన, కేంద్ర ఉపరితల రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ఈ వర్క్ షాప్జరగనున్నది.
మంత్రి కోమటిరెడ్డితో పాటు రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్లు బీవీ రావు, ధర్మారెడ్డి, వసంత్ నాయక్ లు వడోదరకు బయలుదేరి వెళ్ళారు. ప్రధానమంత్రి గతి శక్తి కార్యక్రమంతో పాటు పలు ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంపై చింతన్ శివిర్ లో చర్చించనున్నారు. ఈ వర్క్‌షాప్ లో పాల్గొనడానికి అన్ని రాష్ట్రాల ఆర్ అండ్‌బీ శాఖ మంత్రులు, ఆఫీసర్లకు ఆహ్వానం పంపించారు. 2 రోజుల పాటు 5 సెషన్స్ గా చర్చలు జరుగుతాయి.
రాష్ట్ర ప్రాజెక్ట్‌లపై చర్చిస్తాం: మంత్రి వెంకట్ రెడ్డి
తెలంగాణలోని పలు కీలక ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఈ వర్క్‌షాప్‌లో చర్చిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆదివారం గుజరాత్ బయల్దేరే ముందు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రీజనల్ రింగ్ రోడ్డు, నేషనల్హైవే -65 విస్తరణ, ఎల్బీనగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం వంటి పలు ప్రాజెక్ట్స్ పై చర్చిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రాజెక్టుల సాధనకు అవసరమైన కేంద్ర సహకారంపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి తనతో పాటు ఆర్అండ్ బీ శాఖ ఆఫీసర్లకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలిపారు.
