తెలంగాణ నీళ్లను బాబుకు గిఫ్ట్ ప్యాక్ చేస్తున్రు : కవిత  

తెలంగాణ నీళ్లను బాబుకు గిఫ్ట్ ప్యాక్ చేస్తున్రు : కవిత  
  • కరువుతో జనం అల్లాడుతుంటే సీఎం రేవంత్ పట్టించుకోవట్లే: కవిత 
  • నవంబర్ దాకా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాలి 
  • కరువు పరిస్థితుల్లో తెలంగాణకు కేంద్రం అండగా నిలవాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నీళ్లను గిఫ్ట్ ప్యాక్ చేసి ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి పంపిస్తున్నారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే సీఎం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆదివారం బంజారాహిల్స్‌‌లోని టీఆర్‌‌ఎస్ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, కొన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు 20 మీటర్ల లోతుకు పడిపోయాయని తెలిపారు.

సూపర్ ఎల్‌‌నినో ప్రభావంపై ముందే శాస్త్రవేత్తలు హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. సీఎం నిర్లక్ష్యంతో కోటి 20 లక్షల ఎకరాల్లో పంటలు ప్రమాదంలో పడ్డాయని ఆరోపించారు. బావులు, బోర్ల కింద సాగు చేసిన పంటలు చేతికొచ్చే వరకు నవంబర్ చివరి దాకా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులపై వెంటనే ప్రత్యేక కేబినెట్ సమావేశం పెట్టి, ముందున్న పరిస్థితులను ఎదుర్కొనే కార్యాచరణ ప్రకటించాలని కోరారు.

పాలమూరు-–-రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ రిజర్వాయర్‌‌కు సంబంధించిన గ్రామాలకు పునరావాసం కల్పించి నీటిని నింపితే చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరిగేవని కవిత అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి ఆయకట్టుకు కూడా నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉండేదన్నారు. కరువుతో ఇబ్బంది పడుతున్న తెలంగాణకు ప్రధాని మోదీ ఉచిత కరెంట్ ఇచ్చి అండగా నిలువాలన్నారు.

బ్యాలెట్‌‌తోనే ఎన్నికలు జరపాలి

దేశంలో మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. ఈవీఎంలలో అవకతవకలకు అవకాశం ఉందని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలని, అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్లి పోరాడుతామని చెప్పారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికతో పాటు రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు.

నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి

నేరెళ్ల బాధితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మోసం చేస్తున్నాయని కవిత ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నేరెళ్ల ఘటనకు సంబంధించిన కీలక రిపోర్టులు, ఆధారాలు ఏమయ్యాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటి జైలర్ నివేదికలు, డీఐజీ రవివర్మ బాధితులతో మాట్లాడి రూపొందించిన రిపోర్టులు ఎక్కడున్నాయో స్పష్టం చేయాలన్నారు. బాధితులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.