కాకా యాదిలో.. 97వ జయంతి: ఆధిపత్య రాజకీయ వ్యవస్థను ఛేదించిన కాకా

కాకా యాదిలో.. 97వ జయంతి: ఆధిపత్య రాజకీయ వ్యవస్థను ఛేదించిన కాకా

2026 అక్టోబర్‌‌ 5న గడ్డం వెంకటస్వామి(కాకా) 97వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం అంటే ఒక కాంగ్రెస్‌‌ నాయకుడి రాజకీయ జీవితాన్ని మాత్రమే గుర్తుచేసుకోవడం కాదు. తెలంగాణ, ఆంధ్ర రాజకీయాల్లో కులం, వర్గం, ప్రాంతం, పార్టీ అధికారం, ప్రజాస్వామ్య ఎన్నికలు పరస్పరం ఎలా పనిచేశాయో అర్థం చేసుకోవడం. ఆయన జీవితం ఒక ముఖ్యమైన రాజకీయ అధ్యయన అంశం.

1929 అక్టోబర్‌‌ 5న నిజాం సంస్థానంలోని హైదరాబాద్‌‌ నగరంలోని తోపుఖానా ప్రాంతంలో మాల కుల మల్లయ్య, పెంటమ్మ దంపతులకు జన్మించిన వెంకటస్వామి, సాధారణ సామాజిక నేపథ్యం నుంచి ప్రారంభించి పార్లమెంటరీ రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. 

ఆయన తండ్రి మల్లయ్య నిజాం సైన్యంలో పనిచేసి, తరువాత మేస్త్రీగా జీవనం సాగించగా, తల్లి పెంటమ్మ కుటుంబ పోషణ కోసం కూలి పని చేసేవారు. ఈ కుటుంబ అనుభవం ఆయనలో పేదల జీవన వాస్తవాలపై చిన్ననాటి నుంచే అవగాహన పెంచిందని చెప్పవచ్చు. 

వెంకటస్వామి విద్యాభ్యాసం కూడా ఆయన భవిష్యత్‌‌ రాజకీయ దిశను అర్థం చేసుకోవడానికి కీలకం. మొదట ఆర్య సమాజ్‌‌ పాఠశాలలో ఐదో తరగతి వరకు చదివారు. తరువాత ఉర్దూ మాధ్యమంలో మెట్రిక్యులేషన్‌‌ వరకు విద్యను ఆభ్యసించారు. నిజాం పాలనలో ఉర్దూకు ఉన్న అధికార ప్రాధాన్యత, మరోవైపు ఆర్య సమాజ్‌‌ పాఠశాలల్లో పెరిగిన జాతీయవాద వాతావరణం ఈ రెండు భిన్న అనుభవాలు ఆయన బాల్య మానసిక ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. 

ఆయన రాజకీయ ప్రస్థానానికి మొదటి బలమైన పునాది కార్మిక ఉద్యమం. 1960-70 వ దశాబ్దాలలో హైదరాబాద్‌‌ పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు, గుడిసె వాసులు ఎదుర్కొన్న సమస్యలను ఏ అగ్రకుల రాజకీయ నాయకుడు పట్టించుకోనప్పుడు ఆయన రాజకీయ ప్రశ్నలుగా మార్చారు. ఇండియన్‌‌ నేషనల్‌‌ ట్రేడ్‌‌ యూనియన్‌‌ కాంగ్రెస్‌‌లో నాయకత్వం వహించడం, నేషనల్‌‌ హట్స్‌‌ యూనియన్‌‌ ద్వారా నిరుపేదలకు గృహాల కోసం పోరాడటం ఆయనకు ప్రత్యేకమైన ప్రజా ఆధారాన్ని నిర్మించాయి.

ఇక్కడ ఆయన జీవితాన్ని డాక్టర్‌‌ బి.ఆర్‌‌. అంబే ద్కర్‌‌ ఆలోచనలతో పోల్చి చూడడం 
అతిశయోక్తి కాకపోవచ్చు. అంబేద్కర్‌‌ ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే పిలుపుతో అణగారిన వర్గాలకు విద్య,  సంఘటిత, పోరాట రాజకీయ శక్తి అవసరమని స్పష్టం చేశారు. 

విద్యా సంస్థల స్థాపన ద్వారా ‘సామాజిక చైతన్య బోధన’ అనే మూడు అంశాలను తనదైన పద్ధతిలో ఆచరణలో పెట్టారు. 1973లో డాక్టర్‌‌ బి.ఆర్‌‌. అంబేద్కర్‌‌ ఎడ్యుకేషన్‌‌ సొసైటీని స్థాపించి పాఠశాల, జూనియర్‌‌, డిగ్రీ, పీజీ, న్యాయ విద్యాసంస్థలను అభివృద్ధి చేయడం ఈ దిశలో ఆయన చేసిన ముఖ్యమైన సంస్థాగత ప్రయత్నం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌ రాజకీయాల్లో బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వెలమ వంటి ఆధిపత్య కులాలు అధికార నిర్మాణాలపై గణనీయమైన ప్రభావం చూపినట్లు తెలుగు  ప్రాంతాల రాజకీయ చరిత్రను అధ్యయనం చేసిన గేల్ హోంవెట్, గౌతమ్ పింగిలి, పురేంద్ర ప్రసాద్, కె. సి. సూరిల రాజకీయ, సామాజిక శాస్త్ర పరిశోధనలు విశ్లేషించాయి.

కాంగ్రెస్‌‌ కూడా ఒకవైపు ఆధిపత్య కులాల నాయకత్వాన్ని, మరోవైపు ఎస్సీలు, కార్మికులు, పేదలు, ఇతర బలహీన వర్గాల ఓటర్లను కలుపుకున్న విస్తృత రాజకీయ సంకీర్ణంగా పనిచేసింది. ఈ నేపథ్యంలో వెంకటస్వామి ఎదుగుదలను కేవలం వ్యక్తిగత ప్రజాదరణతో వివరించడం సరిపోదు. 

కార్మిక సంఘటితం, నియోజకవర్గ సంబంధాలు, పేదలతో ప్రత్యక్ష అనుబంధం, కాంగ్రెస్‌‌లోని వర్గ సమీకరణాలను అర్థం చేసుకునే సామర్థ్యం, కేంద్ర నాయకత్వంతో సంబంధాలు ఇవన్నీ ఆయన రాజకీయ మూలధనంగా పనిచేశాయి. ఆయన ప్రత్యేకత ఏమిటంటే ఆధిపత్య వ్యవస్థను బయట నుంచి మాత్రమే వ్యతిరేకించకుండా, దాని లోపలికి ప్రవేశించి, అందులో తన  బాధిత సామాజిక వర్గాలకు రాజకీయ స్థలాన్ని విస్తరించడం.

బలహీన వర్గాలకు కాకా ఒక మోడల్
కాకా జీవితాన్ని విమర్శనాత్మకంగా చదవడం కూడా అవసరం. అంబేద్కర్‌‌ స్వతంత్ర రాజకీయ ప్రాతినిధ్యానికి ఇచ్చిన ప్రాధాన్యతతో  పోలిస్తే వెంకటస్వామి మోడల్‌‌ భిన్నమైనది. అది ‘స్వతంత్ర ప్రత్యామ్నాయం’ కంటే  ‘ఆధిపత్య వ్యవస్థలో రాజకీయ స్థలం సాధించడం’ అనే మోడల్‌‌. అందువల్ల నేటి బలహీన వర్గాల రాజకీయ నాయకులకు వెంకటస్వామి జీవితం ఒక ముఖ్యమైన పాఠాన్ని అందిస్తుంది. 

ఆధిపత్య కులాల ఆధిపత్యం ఉన్న పార్టీలు, ఎన్నికల వ్యవస్థలు, రాజకీయ సంస్థల్లో కొనసాగుతూ సామాజిక ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లాలంటే కేవలం కుల గుర్తింపు సరిపోదు. ప్రజలతో నిరంతర సంబంధం, సంస్థాగత నిర్మాణం, విద్య సామాజిక పెట్టుబడిగా చూసే దృక్పథం, కార్మిక, పేదల సమస్యలపై ప్రత్యక్ష పోరాటం, పార్టీ అంతర్గత రాజకీయాలను అర్థం చేసుకునే సామర్థ్యం, అవసరమైనప్పుడు  సొంత పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించే ధైర్యం అవసరం.

కాకా నుంచి విలువైన పాఠం
అందుకే కాకా వెంకటస్వామి వారసత్వం ఒక వ్యక్తి విజయ గాథ కంటే ఎక్కువ. అది ఉదారవాద ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఒక అణగారిన వర్గానికి చెందిన నాయకుడు ఆధిపత్య రాజకీయ నిర్మాణాల మధ్య ఎలా స్థానం సంపాదించగలడు, ఆ స్థలాన్ని ప్రజా ప్రయోజనాలకు ఎంతవరకు వినియోగించగలడు అనే ప్రశ్నకు ఒక చారిత్రక ఉదాహరణ. అధికారంలో భాగస్వామ్యం కావడం ఒక దశ మాత్రమే,  ఆ అధికారాన్ని విద్య, సామాజిక గౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు, పార్టీకి వారధిగా నిలబడడం, సంస్థాగత సాధికారతగా మార్చడమే అసలు వారసత్వం. నేటి బలహీన వర్గాల నాయకులు వెంకటస్వామి నుంచి నేర్చుకోవాల్సిన అత్యంత విలువైన పాఠం ఇదే.

తెలంగాణ కోసం పార్టీపై ఒత్తిడి 
తెలంగాణ ప్రశ్నలో ఈ లక్షణం మరింత స్పష్టమవుతుంది. ప్రారంభ దశలో తెలంగాణ ఉద్యమంపై ఆయన వైఖరి సందిగ్ధంగా ఉన్నప్పటికీ, తరువాతి కాలంలో ప్రత్యేక తెలంగాణకు ఒక శక్తిమంతమైన మద్దతుదారుగా మారారు. 2008లో ‘వి ఆర్ ఫర్ తెలంగాణ’ అని స్పష్టం చేయడం, అప్పట్లో తెలంగాణపై కాంగ్రెస్‌‌ అధిష్ఠానమైన సోనియాగాంధీ, వైయస్ రాజశేఖర్ రెడ్డిలతో విభేదిస్తూ బహిరంగంగా మాట్లాడటం ఆయన పార్టీ విధేయతకు పరిమితులు ఉన్నాయని చూపిస్తుంది. అంటే ఆయనకు పార్టీ ఒక రాజకీయ వేదిక,  కానీ ప్రజా ప్రయోజనం లేదా ప్రాంతీయ ఆకాంక్షల విషయంలో పార్టీ నిర్ణయాన్నే అంతిమ సత్యంగా అంగీకరించని రాజకీయ ధోరణి కూడా ఆయనలో కనిపించింది. 

  • డా. నాగం కుమారస్వామి
  • రాజనీతి శాస్త్ర ప్రధాన ఆచార్యులు, పాలమూరు యూనివర్సిటీ