మెదక్, వెలుగు : మెదక్ జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం అయ్యింది. రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెదక్ జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డులను కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ వివేక్ వెంకట స్వామి చేతుల మీదుగా సోమవారం ప్రారంభించనున్నారు.
కొత్తగా 28,582 కుటుంబాలకు..
జిల్లాలోని 21 మండలాల పరిధిలో 520 రేషన్ షాప్ లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,42,353 రేషన్ కార్డు లు ఉన్నాయి. కేటగిరీ వారీగా ఏఎఫ్ ఎస్ సీ కార్డులు 13,881, ఎఫ్ఏసీ కార్డులు 2,28,407, ఏఏపీ కార్డులు 65 ఉన్నాయి.
కొద్ది రోజుల కిందట ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. ఈ సందర్భంగా జిల్లాలో 28,582 కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఇదివరకు ఉన్న రేషన్ కార్డుల్లో 1,06,448 మందిని యాడ్ చేశారు. ఆహార భద్రత పథకం కింద రేషన్ కార్డు ఉన్న వినియోగదారులకు రేషన్ షాప్ ల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండగా, జిల్లాలో ప్రతినెలా 5,003 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు జిల్లాలో 2,41,393 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.
కొత్త కేజీబీవీ బిల్డింగ్ లు ఓపెన్
మనోహరాబాద్ మండలం కూచారంలో, చేగుంట మండలం రెడ్డిపల్లిలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ) బిల్డింగ్ లను నూతనంగా నిర్మించారు. వీటిని సోమవారం ఉపాధి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి ప్రారంభించనున్నారు.
