- వర్సిటీ అధికారుల అండతోనే ఏండ్ల తరబడి దందా
హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు జూనియర్ కాలేజీల అఫిలియేషన్ పంచాయితీ ఇంకా ముగియకముందే డిగ్రీ కాలేజీల అక్రమాలు బయటకొస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఒరిజినల్ ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ), ల్యాండ్ పత్రాలు, కార్పస్ ఫండ్ వంటివి ఏవీ లేకుండానే చాలా కాలేజీలు ఏండ్ల తరబడి అఫిలియేషన్ పొందుతున్నాయి. ఒరిజినల్ పత్రాల స్థానంలో కలర్ జిరాక్సులతో వర్సిటీలను బురడీ కొట్టిస్తుండగా, వారికి కొందరు ఆఫీసర్లు అండగా ఉండటంతో వారి దందా యధేచ్చగా కొనసాగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 600 కాలేజీలకు పైగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రైవేటు డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు భూమి పత్రాలు (ల్యాండ్ డాక్యుమెంట్స్), ఒరిజినల్ ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ (ఈసీ)తో పాటు నిర్ణీత మొత్తంలో రూ.7.50 లక్షల కార్పస్ ఫండ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే, అధికారుల అండతో కొన్ని యాజమాన్యాలు ఈ పత్రాలేవీ లేకుండానే గుర్తింపు పొందుతూ ఏండ్ల తరబడి విద్యాసంస్థలను నడిపిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు తూతూమంత్రంగా వ్యవహరించడంతో ఇప్పటివరకు వారి అక్రమాలు బయటకు రాలేదు. ఇటీవల, ఇండస్ కాలేజీపై సీజేఎస్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో ఈ దందా బయటకు వచ్చింది. అనధికారిక లెక్కల ప్రకారం కేవలం ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) పరిధిలోనే 50కి పైగా కాలేజీలు తప్పుడు పత్రాలతో అఫిలియేషన్ పొందినట్టు తెలుస్తోంది. వర్సిటీకి చెల్లించాల్సిన కార్పస్ ఫండ్‌ను ఎగ్గొట్టి, నకిలీ ఈసీలతో మేనేజ్‌మెంట్లు కాలేజీలను నడుపుతున్నట్టు వెలుగులోకి వస్తున్నాయి.
31లోగా ఒరిజి నల్ పత్రాలు ఇవ్వాల్సిందే..
అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో ఓయూ అధికారులు ఎట్టకేలకు మేల్కొన్నారు. వర్సిటీ పరిధిలోని అన్ని ప్రైవేట్ కాలేజీలు ఈ నెల 31లోగా ఒరిజినల్ ఈసీలు, కార్పస్ ఫండ్ సర్టిఫికెట్లు సమర్పించాలని ఓయూ అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గడువులోగా పత్రాలు ఇవ్వని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, వీటిని వెరిఫై చేస్తే మరిన్ని కాలేజీల బాగోతం బయటపడే అవకాశం ఉంది. మిగిలిన యూనివర్సిటీలు కూడా ఇలాగే విచారణ చేయించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన మేనేజ్‌మెంట్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారి గుర్తింపు రద్దు చేయాలని కోరుతున్నాయి.
