- భారత్‌లోనే అధునాతన జలాంతర్గాముల నిర్మాణం
న్యూఢిల్లీ : భారత నేవీకి అధునాతన జలాంతర్గాములు సమకూర్చుకోవడం కోసం చేపట్టిన ప్రాజెక్ట్ 75(ఐ) ఎట్టకేలకు పట్టాలకు ఎక్కనుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుపై త్వరలోనే కేంద్ర ‘కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్)’ సమావేశం కానుంది. ఈ ప్రాజెక్టుకు సీసీఎస్ ఆమోదం తెలిపిన వెంటనే జర్మన్ కంపెనీతో ఒప్పందంపై సంతకాలు, ఆ వెంటనే జలాంతర్గాముల నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ప్రాజెక్ట్ 75(ఐ)లో భాగంగా భారత నావికాదళం కోసం సుమారు రూ.70,000 కోట్ల విలువైన 6 అధునాతన సాంప్రదాయ సబ్‌మెరైన్లను నిర్మించనున్నారు. ఈ సబ్‌మెరైన్లను జర్మనీకి చెందిన థిసెంక్రప్ మెరైన్ సిస్టమ్స్ (టీకేఎంఎస్) భాగస్వామ్యంతో ముంబైలోని మాజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) సంస్థ నిర్మించనుంది.
ఈ ఒప్పందం కోసం చాలా ఏండ్లుగా ప్రతిపాదనలు ఉన్నా, వాణిజ్యపరమైన అంశాలు, సాంకేతిక వివరాలపై చర్చలు పదే పదే నిలిచిపోయాయి. ఇప్పుడు సీసీఎస్ ఆమోదం లభిస్తే కాంట్రాక్టుపై సంతకం చేయడానికి, పనులు ప్రారంభించడానికి మార్గం సుగమంకానుంది. అయితే, ప్రాజెక్ట్ 75(ఐ)పై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడకపోయినా.. జర్మన్ కంపెనీ టీకేఎంఎస్ ఇప్పటికే భారత్‌లో తన భాగస్వాముల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటోంది.
భారీ టార్పెడోలను అభివృద్ధి చేయడానికి, నిర్మించడానికి, అనుసంధానించడానికి, చివరకు ఆధునీకరించడానికి హైదరాబాద్‌కు చెందిన వీఈఎం టెక్నాలజీస్‌తో టీకేఎంఎస్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. టీకేఎంఎస్ అనుబంధ సంస్థ అయిన అట్లాస్ ఎలక్ట్రానిక్ కూడా ఈ మేక్ ఇన్ ఇండియా టార్పెడో ప్రాజెక్టులో భాగస్వామిగా ఉంది. అలాగే, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ వ్యవస్థలపై ముంబైకి చెందిన సీఎఫ్‌ఎఫ్ ఫ్లూయిడ్ కంట్రోల్‌తో కూడా టీకేఎంఎస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. డీఆర్‌డీవోతో సహా ఇతర భారతీయ సంస్థలతో మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం ఈ కంపెనీ ఎదురుచూస్తోంది.
నేవీకి సబ్‌మెరైన్‌ల కొరత
భారత నావికాదళం సాంప్రదాయ సబ్‌మెరైన్ల కొరతను ఎదుర్కొంటున్నది. హిందూ మహాసముద్రంలో చైనా సబ్‌మెరైన్ల కదలికలు పెరుగుతున్న తరుణంలో ప్రాజెక్ట్ 75(ఐ) ఆలస్యం కావడం ఆందోళనకరంగా మారింది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కి, నేవీకి ఆరు సబ్‌మెరైన్‌లు అందినట్లయితే.. హిందూ మహాసముద్రంలో ఇండియన్ నేవీ మరింత బలోపేతం కానుంది. కొత్త సబ్‌మెరైన్‌లు ఎక్కువ సమయంపాటు నీటి అడుగున ఉండేలా నిర్మించనున్నారు. కాగా, భారత్ ఇంతకుముందు ఎండీఎల్ ఫ్రాన్స్ సహకారంతో 6 కల్వరి-క్లాస్ సబ్‌మెరైన్లను నిర్మించింది. మొదటిది 2017లో, చివరిదైన ఐఎన్‌ఎస్ వాగ్‌షీర్ జనవరి 2025లో సర్వీసులో చేరింది.
