శ్రావణ సోమవారం రద్దీ... ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి

శ్రావణ సోమవారం రద్దీ... ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి

బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పవిత్ర శ్రావణ మాసం సోమవారం సందర్భంగా అశోక్ ధామ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి చెందారు.

ఆగస్టు 17 సోమవారం ఉదయం 6:45 గంటల సమయంలో శివాలయంలో భక్తులు భారీ సంఖ్యలో గుమిగూడారు. విద్యుత్ తీగ తెగిపడిందన్న వదంతులు, భారీ రద్దీ కారణంగా ఒక్కసారిగా ప్రజలు పరుగెత్తడంతో  టెంపుల్ ఎంట్రీ దగ్గర  ఉన్న బారికేడ్లు విరిగిపడటంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, పదిహేను మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే లఖిసరాయ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే, అక్కడ తగినంత భద్రతా సిబ్బంది లేకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. ప్రవేశ మార్గంలో జనం ఒక్కసారిగా తోసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.పరిస్థితిని అంచనా వేసి తగిన ఏర్పాట్లు చేశామని, అయినప్పటికీ ఊహించని రీతిలో జనసమద్దం పెరగడం వల్లే బారికేడ్లు విరిగిపోయాయని లఖిసరాయ్ జిల్లా మెజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ వెల్లడించారు. 2019 శ్రావణ మాసంలో కూడా ఇదే ఆలయంలో ఇలాంటి ఘటనే జరగడం గమనార్హం.