సండ్ర కర్ర అక్రమ రవాణా కేసులో ఇద్దరు అరెస్ట్

సండ్ర కర్ర అక్రమ రవాణా కేసులో ఇద్దరు అరెస్ట్

ఖమ్మం, వెలుగు: గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సండ్ర కర్ర అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులను ఖమ్మం సీసీఎస్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. ఫారెస్ట్ అధికారులు జారీ చేసిన అనుమతి పత్రాలను ట్యాంపరింగ్ చేసి కలపను అక్రమంగా రవాణా చేసినట్లు సీసీఎస్ ఏసీపీ సర్వర్ తెలిపారు. ఖమ్మం ఫారెస్ట్ రేంజర్ ఫిర్యాదు మేరకు గత డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో సీసీఎస్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో కేసు నమోదైంది. నిందితుడు కొర్ర శివ నల్లతుమ్మ కర్రకు జారీ చేసిన అనుమతి పత్రాలను ట్యాంపరింగ్ చేసి, సండ్ర కర్రగా మార్చి పరిసర ప్రాంతాల్లో చెట్లను నరికించి విజయవాడకు చెందిన వ్యాపారి రాధేశ్యామ్‌‌‌‌‌‌‌‌కు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు.

రాధేశ్యామ్ ఈ కలపను మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని జాబువాలో ఏఎం ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌‌‌‌‌కు సరఫరా చేసినట్లు విచారణలో తేలిందన్నారు. పాన్‌‌‌‌‌‌‌‌మసాలాలో ఉపయోగించే కత్తా తయారీలో సండ్ర కర్రను వినియోగిస్తారని తెలిపారు. సుమారు 9 లారీల కలపను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు. కొర్ర శివపై వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోనూ ఫారెస్ట్ కేసులు ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసి, ఇతర నిందితులను కూడా అరెస్టు చేస్తామని చెప్పారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.