యూజీసీ నెట్ పరీక్షలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ మూడు సబ్జెక్టులకు రీ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది. క్వశ్చన్ పేపర్లలో అనేక తప్పులు ఉన్నాయని అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో NTA ఏర్పాటు చేసిన కమిటీ ప్రశ్నపత్రాలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మూడు పేపర్లకు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో రీఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రకటించింది.
ఈ ఏడాది జూన్ 22 నుంచి 30 వరకు 87 సబ్జెక్టుల్లో యూజీసీ నెట పరీక్షలు నిర్వహించారు. అయితే ఇంగ్లీష్ , కామర్స్, సోషియాలజీ పేపర్లలో ప్రశ్నలు, పేర్లు, పుస్తకాల పేర్లు, ట్రాన్స్ లేషన్, గ్రామర్, టైపింగ్ లలో తప్పులు ఉన్నట్లు గుర్తించింది ఎన్టీఏ. కొన్ని ప్రశ్నలు గతంలో కూడా అడిగినవే ఉన్నట్లు తేలింది. ఇన్ని తప్పులను కొన్ని ప్రశ్నలను తొలగించడం ద్వారా సరిచేయడం సాధ్యం కాదని కమిటీ అభిప్రాయపడింది. దీంతో అభ్యర్థులకు న్యాయం చేసేందుకు ఈ మూడు సబ్జెక్టుల పరీక్షలను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించారు.
ఇంగ్లీష్, కామర్స్ పరీక్షలు సెప్టెంబర్ 9న నిర్వహిస్తామని NTA ప్రకటించింది. ఇంగ్లీష్ పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, కామర్స్ పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. సోషియాలజీ పరీక్ష సెప్టెంబర్ 10న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.
పరీక్ష కేంద్రాలు, అడ్మిట్ కార్డుల వివరాలను NTA త్వరలో ప్రకటించనుంది. రీ-ఎగ్జామ్‌కు అభ్యర్థుల నుంచి అదనపు ఫీజు వసూలు చేయరు. మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలు షెడ్యూల్ ప్రకారం విడుదలవుతాయి. JRF, అసిస్టెంట్ ప్రొఫెసర్, PhD ప్రవేశాల ప్రక్రియకు ఈ రీ-ఎగ్జామ్ వల్ల ఎలాంటి ఆలస్యం ఉండదని NTA స్పష్టం చేసింది.
