‘మూసీ’ పరిధిలోనే లక్ష ఎకరాల్లో వరిసాగు.. యాదాద్రి జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో వరి నాట్లు

‘మూసీ’ పరిధిలోనే  లక్ష ఎకరాల్లో వరిసాగు.. యాదాద్రి జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో వరి నాట్లు
  • 14 మండలాల్లో కలిపి 80 వేల ఎకరాలే..  మూసీ కిందే ఎక్కువ సాగు.. 
  • పత్తి లక్ష ఎకరాలు కాగా, కంది, మిగతా పంటలు కలిపి 52 వేల ఎకరాలు..

యాదాద్రి, వెలుగు : ఈసారి ఎల్​నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో వరి సాగును తగ్గించుకొని, ఆరుతడి పంటల సాగు పెంచాలని సర్కారు సూచిస్తోంది. అయినప్పటికీ యాదాద్రి జిల్లాలోని మూసీ పరివాహక ప్రాంతంలో వరి పంటనే ఎక్కువగా సాగు చేస్తుండగా, ఇతర ప్రాంతాల్లో వరి సాగును తగ్గించారు. 

మొత్తం 4 లక్షల ఎకరాలకు పైగా సాగు..

యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లో 6.14 లక్షల ఎకరాలకు పైగా సాగు భూమి ఉంది. అన్ని రకాల పంటలు కలిపి 4 లక్షల ఎకరాలకు పైగా సాగులో ఉంది. ఈ సీజన్​లో ఎల్​నినో ప్రభావం కారణంగా వర్షాలు సరిగా కురవడం లేదు. 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 14 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వానలు కురవక పోవడంతో చెరువులు, కుంటల్లో నీరు పూర్తిగా అడుగంటి పోయింది. విధిలేని పరిస్థితుల్లో మూసీయేతర ప్రాంతాల రైతులు సాగు తగ్గించారు. 

మూసీ ప్రాంతంలోనే ఎక్కువ నాట్లు..  

గత వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 3 లక్షల ఎకరాలకు పైగా వరిని సాగు చేశారు. ఈసారి ఎల్​నినో కారణంగా జిల్లావ్యాప్తంగా 2 లక్షల ఎకరాలకు మించి సాగు చేసే పరిస్థితి లేదని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇప్పటివరకూ 1.80 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. కాగా, మూసీ నదిలో దాదాపు ఏడాది పొడుగునా నీరు ప్రవహిస్తూ ఉంటోంది. 

దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో యాసంగి, వానాకాలం సీజన్లలో క్రమం తప్పకుండా వరిని సాగు చేస్తున్నారు. మూసీ పరిధి ఎక్కువగా ఉన్న రామన్నపేట, వలిగొండ, భూదాన్​ పోచంపల్లి మండలాల్లోనే 82 వేల ఎకరాల్లో నాట్లు వేశారు. కొంత భాగం మూసీ ప్రవహించే బీబీనగర్​, భువనగిరి, చౌటుప్పల్​, మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూర్​ (ఎం) మండలాల్లోని కొన్ని గ్రామాల్లో మరో 20 వేల ఎకరాల్లో నాట్లు వేశారు. 

14 మండలాల్లో కేవలం 80 వేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా పత్తి లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సంస్థాన్​ నారాయణపురం,అడ్డగూడూరు, గుండాల,మోత్కూరు, వలిగొండ మండలాల్లో అత్యధికంగా పత్తి సాగు చేస్తున్నారు. ఆరుతడి పంటల్లో కంది 14 వేల ఎకరాల్లో సాగు చేస్తుండగా, మిగిలిన పంటలన్నీ కలిపి 40 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 

భూగర్భ జలాలు తగ్గుముఖం

జిల్లాలోని భూ గర్భ జలాలు అడుగంటాయి. గతేడాది నవంబర్​ నెలలో 4.50 మీటర్లలో లోతులో జలాలు ఉండగా ఈ ఏడాది మే వరకు 9.25 మీటర్లకు పడిపోయాయి. జూలైలో 10.49 మీటర్లకు పడిపోయింది. ఈ లెక్కన కిందటేడాది నవంబర్​తో పోలిస్తే ఈసారి 5.99 మీటర్లు, ఈ ఏడాది మే నెలతో పోలిస్తే 1.24 మీటర్ల లోతుల్లోకి జలాలు పడిపోయాయి.

 అడ్డగూడూరు, వలిగొండ, భూదాన్​ పోచంపల్లి, చౌటుప్పల్​ మండలాల్లో భూగర్భ జలాలు పరవాలేదు. గుండాలలో  8.52 మీటర్ల లోతుల్లో ఉండగా బొమ్మల రామారంలో 17.60 మీటర్ల లోతుల్లో  పడపోయాయి. చెరువులు దాదాపు ఎండిపోయాయి.