- ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 2 వరకు విడతల వారీగా నిర్వహణ
- నియో పోలీస్, గోల్డెన్ మైల్ తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని స్థలాల వేలం
- రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని అధికారుల అంచనా
హైదరాబాద్‌సిటీ, వెలుగు : గ్రేటర్ పరిధిలో మరోసారి భూముల వేలానికి హెచ్ఎండీఏ సిద్ధమవుతోంది. ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు విడతల వారీగా ఈ -= వేలం నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని రోజుల కింద మోకిల, మేడిపల్లిలో నిర్వహించిన వేలానికి కొనుగోలుదారుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది.
బంజారాహిల్స్‌లో ఉన్న భూమి వేలం.. కోర్టు కేసుల కారణంగా వాయిదాపడింది. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ పరిధిలో మరికొన్ని చోట్ల ఉన్న భూములను వేలం వేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకునేందుకు ఆఫీసర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సారి కోకాపేటలోని నియో పోలీస్, గోల్డెన్ మైల్, నగరంలోని వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న ల్యాండ్స్ ను వేలం వేయాలని నిర్ణయించారు.
మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా, వారు ఇండ్లు కట్టుకోవడానికి గానీ, భవిష్యత్ అవసరాలకు పెట్టుబడిగా గానీ అందుబాటులో ఉండేలా ధరలను నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఈసారి భూముల వేలం ద్వారా దాదాపు రూ. 2 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. భారీ ప్రాజెక్టులు చేపడుతున్నహెచ్ఎండీఏకు నిధుల కొరత వేధిస్తుండడంతో భూముల వేలం ద్వారా వచ్చే ఆదాయంతో ప్రాజెక్టుల పనులు చేపట్టాలని భావిస్తోంది.
కోకాపేటలో మరోసారి వేలం
నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారిన కోకాపేట నియోపోలిస్ప్రాంతంలో ఇప్పటికే విడతల వారీగా భూములను వేలం వేసిన హెచ్ఎండీఏ తాజాగా మరో 4.59 ఎకరాలను వేలం వేయనున్నారు. గతంలో ఎకరానికి రూ. 100 కోట్లు పలుకగా ఈ సారి అప్సెట్ధర ఎకరానికి రూ. 120 కోట్లుగా నిర్ణయించారు.
అలాగే నియోపోలిస్‌ను ఆనుకునే ఉన్న గోల్డెన్మైల్లేఔట్లో 0.70 ఎకరాలను వేలం వేయనున్నారు. ఇందులో కనీస ధర ఎకరానికి రూ. 70 కోట్లుగా నిర్ణయించారు. నియోపోలిస్, గోల్డెన్‌మైల్ వంటి చోట్ల భూములకు భారీ డిమాండ్ ఉండనుంది. ఇక్కడ భూములను కొనుగోలు చేసిన రియల్ఎస్టేట్వ్యాపారులు, బిల్డర్లు, డెవలపర్లు హైరైజ్ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. దీనికి కొనుగోలుదారుల నుంచి కూడా విపరీతమైన డిమాండ్వస్తోంది. దీంతో నియోపోలిస్, గోల్డెన్మైల్లేఔట్లో భూములు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
మధ్య తరగతికీ అందుబాటులో ఉండేలా..
హెచ్ఎండీఏ లేఔట్లలో ప్లాట్లు కొనేందుకు పెద్దసంఖ్యలో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తుంటారు. క్లియర్ టైటిల్‌తో పాటు, ఎలాంటి లిటిగేషన్ లేని భూములు కావడమే ఇందుకు కారణం. దీంతో హెచ్ఎండీఏ ఇప్పటివరకు ఉప్పల్భాగాయత్, మోకిల, కీసర, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో చేపట్టిన ప్లాట్ల అమ్మకాలకు విపరీతమైన డిమాండ్ వచ్చింది.
తాజాగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వలో హెచ్ఎండీఏ రైతుల నుంచి ల్యాండ్పూలింగ్ద్వారా సేకరించిన భూములను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది. అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించింది. ఇక్కడ 60 ప్లాట్లను వేలం వేయనున్నారు. ఇందులో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ధరలు చర్యలు చేపట్టారు. చదరపు గజానికి కనీస ధర రూ. 15 వేలుగా నిర్ణయించారు. ఈ లేఔట్లో 152 నుంచి 300 చదరపు గజాల వరకు ప్లాట్లు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఈ లేఔట్ ఉండడం వల్ల మంచి డిమాండ్‌ఉంటుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇవే కాకుండా మోకిల, కూకట్ పల్లిలోని హైదర్ నగర్ లో 3,453 చదరపు గజాలు, సరూర్‌నగర్‌లో ఉన్న 4,356 చదరపు గజాల భూములను సైతం వేలం వేయనున్నారు.
ఇక్కడ చదరపు గజానికి కనీస రేటు లక్షన్నరగా నిర్ణయించారు. ఇవే కాకుండా గండిపేట మండలం బైరాగిగూడ, చందానగర్, నార్సింగి, సూరారం, కాప్రా, అమీన్పూర్ వంటి ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న ల్యాండ్స్ ను సైతం ఈ సారి వేలం
వేయనున్నారు.
