మసాలా దోశలో ఎలుక.. హోటల్ ఓనరుని 25 లక్షలు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్ !

మసాలా దోశలో ఎలుక.. హోటల్ ఓనరుని 25 లక్షలు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్ !

ముంబై బోరివాలిలోని ఒక హోటల్‌లో 'దోసెలో ఎలుక' వచ్చిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో వ్యవహారం ఇప్పుడు పెద్ద  బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపుల కేసుగా మారింది. ఆహారంలో ఎలుక వచ్చిందనే కారణంతో  హోటల్ యజమానిని రూ. 25 లక్షలు ఇవ్వాలని, లేకపోతే వీడియోను మరింత వైరల్ చేసి హోటల్ మూతపడేలా చేస్తామని బెదిరించిన ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

సమాచారం ప్రకారం అసలేం జరిగిందంటే... సెప్టెంబర్ 24న బోరివాలి వెస్ట్‌లోని 'రాధాకృష్ణ హోటల్'కు మాన్సీ అమిత్ ఆచార్య అనే మహిళ కొందరితో కలిసి వెళ్లింది. వారు ఆర్డర్ చేసిన దోసెలో ఎలుక వచ్చిందని చెబుతూ ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు సెప్టెంబర్ 28న ఆ హోటల్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయడంతో  హోటల్‌ను మూసేశారు.

రూ. 25 లక్షల బ్లాక్‌మెయిలింగ్
హోటల్ మూతపడిన తర్వాత అసలు కథ మొదలైంది. వీడియో తీసిన నిందితులు హోటల్ యజమానిని సంప్రదించి, తమకు డబ్బులు ఇస్తే వీడియోలు వైరల్ కాకుండా ఆపుతామని లేకపోతే హోటల్‌ను శాశ్వతంగా మూయించేస్తామని బెదిరించారు. మొదట రూ. 25 లక్షలు డిమాండ్ చేస్తూ బేరసారాలు చేయగా, ఆ తర్వాత  రూ. 20 లక్షలకు, ఆపై రూ. 15 లక్షలకు తగ్గించారు. చివరికి రూ. 7 లక్షలకు ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా హోటల్ యజమాని  అడ్వాన్స్‌గా  రూ. 1 లక్ష క్యాష్ చెల్లించారు. మిగిలిన రూ. 6 లక్షల కోసం సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 5 మధ్య వాట్సాప్, ఫోన్ కాల్స్ ద్వారా నిందితులు పదేపదే ఫోన్లు చేస్తూ తీవ్ర ఒత్తిడి తెచ్చారు.

రంగంలోకి పోలీసులు
నిందితుల వేధింపులు ఎక్కువ కావడంతో హోటల్ యజమాని సెప్టెంబర్ 29న బోరివాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దింతో రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు నిందితులను పట్టుకోవడానికి ఒక ప్లాన్  వేశారు. పథకం ప్రకారం, అక్టోబర్ 5 సాయంత్రం  సమయంలో మిగిలిన రూ. 6 లక్షల క్యాష్ తీసుకుంటుండగా పోలీసులు నిందితులను సాక్షుల సమక్షంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి మాన్సీ అమిత్ ఆచార్య, కింజల్ సుభాష్ భాటియాలపై  ఎఫ్ఐఆర్ నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై  పలు సెక్షన్ల  కింద  కేసులు బుక్ చేశారు.

రెండు కోణాల్లో దర్యాప్తు
ప్రస్తుతం పోలీసులు ఈ కేసును రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలు దోసెలో ఎలుక రావడం నిజమా ? లేక హోటల్ యజమానిని బ్లాక్‌మైల్ చేయడానికే కావాలని ప్లాన్ చేశారా ? ఇంకా ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్‌లు, నగదు లావాదేవీల ఆధారాలను సేకరించి, ఎఫ్‌డీఏ (FDA) చర్యలకు దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు.