బొగ్గు వేటలో జెన్‌కో.. సింగరేణి బొగ్గులో నాణ్యత లేకపోవడంతో సామర్థ్యం మేర నడవని థర్మల్ ప్లాంట్లు

బొగ్గు వేటలో జెన్‌కో.. సింగరేణి బొగ్గులో నాణ్యత లేకపోవడంతో సామర్థ్యం మేర నడవని థర్మల్ ప్లాంట్లు
  • సింగరేణి బొగ్గులో నాణ్యత లేకపోవడంతో సామర్థ్యం మేర నడవని థర్మల్ ప్లాంట్లు
  • ‘నైనీ’ నుంచి బొగ్గు రవాణాకు ఆటంకాలు 
  • నేడు రాష్ట్రానికి కోల్ ఇండియా ప్రతినిధులు
  • 5 మిలియన్​ టన్నుల నాణ్యమైన బొగ్గు కావాలన్న జెన్ కో అభ్యర్థనపై చర్చలు

హైదరాబాద్, వెలుగు: జెన్​కో నాణ్యమైన బొగ్గు కోసం అన్వేషిస్తోంది. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్​ డిమాండ్​కు తగ్గట్టు థర్మల్​ విద్యుత్​ ఉత్పత్తి చేయాలని ప్రయత్నిస్తున్నది. సింగరేణి సప్లై చేస్తున్న బొగ్గు నాణ్యంగా లేకపోవడంతో ప్రస్తుతం థర్మల్​ ప్లాంట్స్​ సామర్థ్యం మేరకు నడవట్లేదు. యాదాద్రి ప్లాంట్​కు రోజుకు 32 వేల టన్నుల నాణ్యమైన బొగ్గు అవసరం కాగా.. ప్రస్తుతం కేవలం 8 వేల టన్నులు మాత్రమే సరఫరా అవుతోంది.

దీంతో జెన్​కో సీఎండీ హరీశ్​అధికారులతో కలిసి ఒడిశాలోని నైనీ మైన్స్​కు వెళ్లి.. బొగ్గు రవాణాకు సంబంధించి ఆటంకాల పరిష్కారం గురించి అక్కడి జిల్లా కలెక్టర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని థర్మల్​ ప్లాంట్లకు 5 మిలియన్​ టన్నుల నాణ్యమైన బొగ్గు అవసరమని జెన్​ కో ఇప్పటికే కేంద్ర బొగ్గుగనుల శాఖకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్​ వస్తున్న కోల్​ ఇండియా ప్రతినిధులు బొగ్గు సప్లైపై జెన్​కో అధికారులతో చర్చలు జరపనున్నారు.

నాణ్యమైన బొగ్గు లేక కుంటుపడ్డ థర్మల్ ప్లాంట్లు
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రోజుకు 140 మిలియన్​ యూనిట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్​కో లక్ష్యంగా పెట్టుకున్నది. రాష్ట్రంలో థర్మల్​ విద్యుతుత్పత్తి కోసం  జీ9, 10 బొగ్గే ఎక్కువగా అవసరం. 500, 800 మెగావాట్ల సామర్థ్యం గల కేటీపీఎస్​ 6, 7 యూనిట్లు, 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రిలోని వైటీపీఎస్​ నాలుగు యూనిట్లు అధిక నాణ్యత గల బొగ్గుతోనే సమర్థవంతంగా పనిచేస్తాయి. 

సింగరేణి నుంచి నాణ్యమైన బొగ్గు సరఫరా తగినంతగా లేకపోవడం వల్ల ఈ యూనిట్లు తక్కువ సామర్థ్యంతో నడుస్తున్నాయి. దీంతో 2025-26 లో 4 వేల మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి తగ్గింది. తద్వారా జెన్​కో సంస్థకు రూ.2 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. యాదాద్రి ప్లాంట్​లో 4 యూనిట్లకు రోజుకు 32 వేల మెట్రిక్​ టన్నుల బొగ్గు అవసరం ఉండగా కేవలం రెండు రైల్వే రేకుల ద్వారా 8 వేల టన్నుల బొగ్గు మాత్రమే సరఫరా చేస్తున్నారు.

మహానది బొగ్గు ఇవ్వండి..
రాష్ట్ర విద్యుత్​ అవసరాలు తీర్చడానికి మహానది కోల్​ లిమిటెడ్​నుంచి నోటిఫైడ్​ ధరకే5 మిలియన్​ టన్నుల బొగ్గు సరఫరా చేయాలని జెన్​కో కేంద్రబొగ్గు శాఖకు లేఖ రాసింది. ఒప్పందం మేరకు సింగరేణి బొగ్గు సరఫరా కావడంలేదని, రవాణా చేసిన బొగ్గు కూడా నాసిరకంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. 

సింగరేణి సంస్థ ఒప్పందాలు, క్షేత్రస్థాయిలో బొగ్గు నిల్వలు, సరఫరా వివరాలు, సెంట్రల్​ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ)కి రాసిన లేఖలు, కేంద్ర విద్యుత్​శాఖ సెక్రటరీ అధ్యక్షతన జులై 30న జరిగిన ఇంటర్ -మినిస్టీరియల్ కమిటీ (ఐఎంసీ) మీటింగ్​ అంశాలు వివరించారు. జెన్​కో సీఎండీ రాసిన లేఖపై చర్చించి ఒప్పందాలు చేసుకోడానికి కోల్​ ఇండియా ప్రతినిధులు మంగళవారం వస్తున్నారు.

నైనీని సందర్శించిన జెన్​కో సీఎండీ
సింగరేణి సంస్థ ఒడిశాలో నిర్వహిస్తున్న నైనీబ్లాక్​ను జెన్​ కో సీఎండీ హరీశ్, కోల్​ డైరెక్టర్​ నాగయ్య, ఇతర అధికారులు సోమవారం సందర్శించారు. ఈ బ్లాక్​ బొగ్గు రవాణా చేయడానికి ఏర్పడిన అడ్డంకుల గురించి ఆరా తీశారు.

రోజుకు 25 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగితే కేవలం 8 వేల నుంచి 10 వేల టన్నుల లోపే బొగ్గు రవాణా అవుతున్నది. దీంతో గని వద్ద గుట్టలు, గుట్టలుగా బొగ్గు నిల్వలు పేరుకుపోతున్నాయి. రైల్ కారిడార్ పూర్తి కాక రవాణా ఇబ్బందిగా మారిందని సింగరేణి ఆఫీసర్లు వివరించారు. 

గని నుంచి సుమారు 54 కి.మీ దూరం ఉన్న రైల్వే సైడింగ్ వరకు లారీల్లో బొగ్గు తరలిస్తున్నారు. లారీలవల్ల కాలుష్యం పెరుగుతుందని ఆరోపిస్తూ సమీప గ్రామాల ప్రజలు బొగ్గు లారీలను అడ్డుకుంటున్నారని చెప్పారు. ఈ సమస్యపై హరీశ్​ అంగుల్​ జిల్లా కలెక్టర్​తో మాట్లాడారు.

ఒడిషా ప్రభుత్వ సహకారంతో గ్రామస్తుల ఇబ్బందులు తీరుస్తామని హామీ ఇచ్చి లారీలను ఆపకుండా వారిని ఒప్పించారు. దీంతో నైనీ నుంచి రోజుకు 16 వేల మెట్రిక్​ టన్నుల నాణ్యమైన బొగ్గు యాదాద్రి ప్లాంట్కు రానుంది.