సీఈసీ జ్ఞానేశ్ కుమార్కు సుప్రీం నోటీసులు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్కు సుప్రీం నోటీసులు
  • సీఈసీ జ్ఞానేశ్ కుమార్​కు సుప్రీం నోటీసులు
  • ఈసీలు సుఖ్ బీర్ సింగ్, వివేక్ జోషీలకూ జారీ
  • సీఈసీ సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నిరాకరించిన ధర్మాసనం 
  • పత్రికా కథనాల ఆధారంగా ఆదేశాలు ఇవ్వలేం
  • 14 నిర్ణయాలు ఏకపక్షమనే ఆరోపణలపై 
  • ఎన్నికల కమిషన్ వివరణ కోరిన సుప్రీం
  • ఉల్లంఘనలు తేలితే నిర్ణయాలను రద్దు చేస్తం
  • సుప్రీం త్రి సభ్య ధర్మాసనం స్పష్టీకరణ


న్యూఢిల్లీ:  కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన 14 కీలక నిర్ణయాలను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా తీసుకున్నారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సీఈసీని వెంటనే సస్పెండ్ చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనపై ఏకపక్ష మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. సోమవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనతో కూడిన ధర్మాసనం ఈసీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ), సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీశ్ గార్గ్, డీజీ (ఐటీ) సీమా ఖన్నాకు నోటీసులు జారీ చేసింది. 

14 కీలక నిర్ణయాలపై వివరణ ఇవ్వండి

‘సర్​’కు సంబంధించిన 14 కీలక నిర్ణయాలను ఈసీఐ పేరుతో సీఈసీ తీసుకున్నారని, ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను పట్టించుకోలేదని 'ది ఇండియన్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్' ఇటీవల ఓ కథనం ప్రచురించింది. దీని ఆధారంగానే రాకేశ్ కుమార్ సింగ్,  న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి పిటిషన్లు వేశారు.  ‘సర్​’లోని వివిధ దశలపై సంధు, జోషి 2025 అక్టోబర్ నుంచి 2026 ఆగస్టు మధ్య కనీసం 14 అభ్యంతరాలు నమోదు చేశారని పిటిషన్లలో పేర్కొన్నారు. అయితే వీటిని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏక పక్షంగా  తీసుకున్నారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ను సుప్రీంకోర్టు  ఆదేశించింది. 

దేశం తగలబడిపోతుంది

పిటిషనర్ రాకేశ్ కుమార్ సింగ్ తరఫున సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. సీఈసీ నియామక ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ఇప్పటికే విస్తృత ధర్మాసనం ముందు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉందని, అయితే ఓటు హక్కుపై ప్రతి పౌరుడు అభద్రతతో ఉన్నందున కొన్ని మధ్యంతర చర్యలు అవసరమని కోరారు. సీఈసీ చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం ఈసీఐ నిర్ణయాలు వీలైనంత వరకు ఏకగ్రీవంగా, కుదరకపోతే మెజారిటీతో జరగాలని గుర్తుచేశారు. సెక్షన్ 16 కింద సీఈసీకి విధి నిర్వహణలో చట్టపరమైన రక్షణ ఉందని, ఆ రక్షణ సుప్రీంకోర్టు జడ్జీలకు కూడా లేదని ప్రస్తావించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి పునాదినే దెబ్బతీసే తీవ్ర పరిస్థితి నెలకొందని, సీఈసీ చట్టబద్ధ చట్రానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వికాస్ సింగ్ ఆరోపించారు. అసలు ఉల్లంఘన జరిగిందా? లేదా అన్నది తేలాల్సి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుంటే "దేశం తగలబడిపోతుంది" అని వికాస్ సింగ్ వాదించారు. 


సీఈసీని సస్పెండ్ చేస్తే ఎన్నికల నిర్వహణ ఎలా?  


సీఈసీని సస్పెండ్ చేస్తే ఈసీఐ కార్యకలాపాలే స్తంభించిపోతాయని, అప్పుడు ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు బాధ్యతలు చూసుకోవచ్చని వికాస్ సింగ్ సూచించారు. ప్రతివాదుల స్పందన తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు చెప్పడంతో, ఈసీఐ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా లేదా మెజారిటీతోనే జరగాలని ఆదేశించాలని ఆయన కోరారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ, ఇది తప్పనిసరిగా పాటించాల్సిన చట్టమని, వారు పాటిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఒకవేళ ఉల్లంఘన జరిగితే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కోర్టు ఎన్నికలనుగానీ, ఎన్నికైన ప్రభుత్వాన్నిగానీ రద్దు చేయలేరని వికాస్ సింగ్ వాదించారు. ఎస్‌‌ఐఆర్‌‌లోని ఏకపక్ష నిర్ణయాల వల్ల ఓటర్ల జాబితానే లోపభూయిష్టంగా మారిందని వివరించారు. 


సిట్ ఏర్పాటు చేయండి


పిటిషనర్ శైలేంద్ర మణి త్రిపాఠి తరఫున సీనియర్ అడ్వకేట్ మేనకా గురుస్వామి హాజరయ్యారు.  చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏక పక్షంగా తీసుకున్న 14 నిర్ణయాలను వెంటనే రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి తోగానీ లేదా సిట్ ఏర్పాటు చేసి కానీ విచారణ చేయించాలని పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో సైబర్, ఐటీ నిపుణులు సహకరించాలని, ఈసీఐనెట్, ఈఆర్ఓనెట్ డేటాబేస్‌‌లపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని తెలిపారు. ఎస్‌‌ఐఆర్ సందర్భంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 13 కోట్ల పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించారని పిటిషన్ లో పేర్కొన్నారు. జ్ఞానేశ్ కుమార్, సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీశ్ గార్గ్, డీజీ (ఐటీ) సీమా ఖన్నాతోపాటు బాధ్యులైన ఇతర అధికారులపై ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 32 కింద ఫిర్యాదు నమోదు చేసి ప్రాసిక్యూషన్ ప్రారంభించేలా సంబంధిత అథారిటీని ఆదేశించాలని పిటిషనర్ కోరారు.  ఫామ్ –6 ను అనధికారికంగా మార్చడం, ఓటర్ల జాబితా డేటా బేస్ లను కేంద్రీకృతం చేయడం సరికాదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఫారం –6ను మార్చడంపైనా అభ్యంతరం తెలిపారు.


ప్రతివాదుల వాదనలు విన్న తర్వాత ఆదేశాలు


సీఈసీ జ్ఞానేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “పత్రికా కథనాల ఆధారంగా ఉత్తర్వులు ఇవ్వలేం. ప్రతివాదుల వాదన వినకుండా ఇలాంటి ఆదేశాలు ఎలా ఇస్తాం?” అని జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాగ్చీ ప్రశ్నించారు. రికార్డుల్లో కొన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకోలేదని తేలితే వాటిపై స్టే ఇచ్చి, అవి చట్టవిరుద్ధమని ప్రకటిస్తామని చెప్పారు. అయితే అన్ని నిర్ణయాలూ ఏకపక్షమేనని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పార్టీగా నిర్ధారించలేమన్నారు.