- నవనీత్, దీపిక అద్భుతమైన గోల్స్
- విమెన్స్ హాకీ వరల్డ్ కప్‌లో ఇండియాకు శుభారంభం
న్యూఢిల్లీ: ఎఫ్‌ఐహెచ్ విమెన్స్ హాకీ వరల్డ్ కప్ పోరులో ఇండియన్ టీమ్ పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ చైనాతో జరిగిన మ్యాచ్‌ను 2--–2 తేడాతో డ్రా చేసుకుంది. హోరాహోరీగా సాగిన పోరులో రెండు టీమ్‌లు చివరి వరకు పోరాడి తలా ఒక పాయింట్‌తో సరిపెట్టుకున్నాయి. మ్యాచ్ ప్రారంభమైన ఎనిమిదో నిమిషంలోనే ఇండియన్ ఫార్వర్డ్ ప్లేయర్ నవ్‌నీత్ కౌర్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో జట్టుకు శుభారంభాన్ని అందించింది.
అయితే, మొదటి క్వార్టర్ ఆఖరి నిమిషంలో చైనాకు లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను జ్యాంగ్ యింగ్ గోల్‌గా మలిచి స్కోరును సమం చేసింది. ఆ తర్వాత రెండో క్వార్టర్ 25వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను దీపిక అద్భుతమైన డ్రాగ్ ఫ్లిక్‌తో నెట్‌లోకి పంపి ఇండియాను 2–1 ఆధిక్యంలో నిలిపింది. మూడో క్వార్టర్‌లో తీవ్ర ఒత్తిడి పెంచిన చైనా, 39వ నిమిషంలో మా నింగ్ చేసిన పెనాల్టీ కార్నర్ గోల్‌తో మ్యాచ్‌ను మళ్లీ సమం చేసింది. చివరి క్వార్టర్‌లో చైనా వరుస దాడులు చేసినప్పటికీ, భారత గోల్‌కీపర్ సవితా పునియా, డిఫెండర్లు అద్భుత ప్రతిభతో ప్రత్యర్థికి గోల్ ఇచ్చే అవకాశం లేకుండా చేశారు.
