హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహించిన టీజీ ఎడ్‌సెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తయింది. కన్వీనర్ కోటా కింద ఉన్న మొత్తం 189 కాలేజీల్లో 13,965 సీట్లకుగాను, మొదటి విడతలో 9,407 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్టు అడ్మిషన్ల కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. కాగా, ఎడ్‌సెట్ ఎంట్రెన్స్‌లో 28,446 మంది క్వాలిఫై కాగా, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 16,755 మంది అప్లయ్ చేస్కున్నారు. వీరిలో 15,009 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారికి మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయించారు.
యూనివర్సిటీ పరిధిలోని 3 కాలేజీల్లో ఉన్న 250 సీట్లకుగాను 253 మందికి (ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి ) సీట్లు దక్కాయి. 4 ప్రభుత్వ కాలేజీల్లో 400 సీట్లకుగాను 373 భర్తీ అయ్యాయి. 179 ప్రైవేట్ కాలేజీల్లో 15,800 సీట్లుండగా.. 8,586 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. సీట్లు పొందినవాళ్లు ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ నెల 20వ తేదీ లోపు తమకు కేటాయించిన కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై రిపోర్ట్ చేయాలని కన్వీనర్ సూచించారు.
